డిచ్పల్లి, జనవరి 3 : శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసు పాత్ర కీలకమైనదని, విధి నిర్వహణలో వ్యవహార శైలి బాగుండి, ఎలాంటి ప్రలోభాలకు గురికానప్పుడే ప్రజల్లో గౌరవం ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు. మండలకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్‌లో టీజీఎస్పీ- 2024 బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
తొమ్మిది నెలలపాటు శిక్షణ పొంది, పాసింగ్ అవుట్ అవుతున్న వారికి అభినందనలు తెలిపారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహించి, ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఏడో బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్‌కు రాష్ట్రంలోనే మంచి పేరు ఉన్నదని అన్నారు. కమాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. 2002లో ఏడో బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్‌గా గుర్తింపు పొందిందని, ప్రస్తుతం 14వ బ్యాచ్ శిక్షణ పూర్తిచేసుకున్నదని తెలిపారు.
ఈ బ్యాచ్‌లో (491) ఎస్‌సీటీపీసీ రాచకొండ, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి వారిని కేటాయించగా, 463 మంది శిక్షణ పూర్తి చేసుకున్నట్లు వివరించారు. తొమ్మిది నెలల పాటు శిక్షణలో ప్రతిభ కనబర్చిన ఎస్సీటీపీసీఎస్లతోపాటు శిక్షణ ఇచ్చిన సిబ్బందికి ఇన్చార్జి సీపీ ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. శిక్షణ పొందిన వారిలో బెస్ట్ ఫైర్ జి. శివకృష్ణ, బెస్ట్ అవుట్డోర్ అండ్ బెస్ట్ ఆల్‌రౌండర్ బి.రవి, బెస్ట్ ఇండోర్ కె.నవీన్‌కుమార్‌రెడ్డి, పరేడ్ కమాండర్ జి.నిరంజన్ రెడ్డి అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ శరత్‌కుమార్, సత్యనారాయణ, అయ్యవారయ్య, అనుపమ, ప్రహ్లాద్, వసంత్‌రావు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.