రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణంతో ఉమ్మడి జిల్లాలోని పలు కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్లిన తమ బిడ్డల కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు వైద్యవిద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. పదుల సంఖ్యలో జిల్లావాసులు అక్కడ ఉండి ఉంటారని భావిస్తుండగా.. వారిలో ఆరుగురి వివరాలు అధికారులకు అందాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన ఇద్దరు, నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన ఒకరు, బోధన్‌కు చెందిన ఇద్దరితోపాటు నిజామాబాద్ కోటగల్లీకి చెందిన విద్యార్థిని కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయినట్లు సమాచారం.
నిజామాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ఉమ్మడి జిల్లాలోని పలు కుటుంబాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వాసులు అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా గురువారం ఉదయం నుంచి రష్యా వరుసబాంబు దాడులకు తెగబడడంతో మన ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, కామారెడ్డి ప్రాంతాలకు చెందిన యువతీ యువకులు కొంతమంది ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్లు సమాచారం. వీరంతా తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించినప్పటికీ.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని కుటుంబీకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని పోలీసులు, అధికార యంత్రాంగానికి ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. ఏటా వందలాది మంది అక్కడికి కెళ్లి ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్నారు. అనంతరం స్వదేశానికి వచ్చి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించే అర్హత పరీక్ష రాసి దేశంలోనే ఇష్టమొచ్చిన ప్రాంతాల్లో వైద్యవృత్తిని ప్రారంభిస్తున్నారు. ఉక్రెయిన్‌లో వైద్యవిద్యను నేర్చుకుని వృత్తి ధర్మం నిర్వహిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు రోజురోజుకూ పెరుగుతున్నది. భారతదేశం నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపే విద్యార్థులకు అనుసంధానకర్తగా బ్రోకరేజీ కంపెనీ పని చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు సైతం ఉక్రెయిన్‌లోని వైద్యవిద్యను అందిస్తోన్న యూనివర్సిటీలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటున్నాయి. వారికి అక్కడే విద్య, బస ఏర్పాట్లు చేస్తూ సేవలు అందిస్తున్నట్లుగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. కన్సల్టెన్సీల ద్వారా ఉక్రెయిన్‌కు వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాలతో హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారు. తాము సంప్రదించిన బ్రోకరేజీ కంపెనీ నుంచి సమాచారం తెలుసుకుంటున్నప్పటికీ వారి నుంచి సరైన స్పందన రావడం లేదని సమాచారం. కన్సల్టెన్సీలు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవడం కష్టతరంగా మారింది.
రష్యా ముప్పేట దాడులతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. రాజధాని కీవ్ నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కొందరు పిల్లాపాపలతో కలిసి మెట్రోస్టేషన్లు, ఇతర సురక్షిత ప్రాంతాలు, బంకర్లలో తలదాచుకుంటున్నారు. రష్యా జెట్లు, డ్రోన్ల దాడులు చేస్తుండడంతో తమకు కావాల్సిన వాళ్లకు ఏం జరుగుతుందోనని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తమ టార్గెట్ సాధారణ ప్రజలు కాదని సైన్యం మాత్రమేనని రష్యా చెబుతున్నప్పటికీ.. బాంబుల మోతతో భయాందోళనలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దురాక్రమణ వేగంగా సాగుతున్నది. దీంతో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. విద్యుత్ గ్రిడ్లు స్తంభించాయి. ఇంటర్నెట్ సేవలకు విఘాతం ఏర్పడుతున్నది. కీవ్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న రష్యా విమానాలు అనేక ప్రాంతాలపై దాడి చేస్తున్నాయి. కీవ్ ఎయిర్‌పోర్టు మూతపడడంతో విదేశీయులు ఎక్కడి వారు అక్కడే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాచార వ్యవస్థ క్షీణిస్తుండడంతో అక్కడి వారికి ఏం జరుగుతుందో తెలియక అంతా అయోమయంగా మారింది.
ఈ కుర్రాడి పేరు.. నిజాముద్దీన్. బోధన్ వాసి. 2020లో నెల్లూరులోని స్నేహితుడి ఇంటికి వెళ్లి లాక్డౌన్ విధించడంతో నిజాముద్దీన్ అక్కడే చిక్కుకుపోయాడు. కొడుకు కోసం ఆందోళన చెందిన తల్లి రజియాబేగం స్కూటీపై నెల్లూరు వెళ్లి కొడుకును వెంట తీసుకుని వచ్చింది. స్కూటీపై 1500 కిలోమీటర్ల ప్రయాణం అప్పట్లో ఓ సంచలనం. తర్వాత నిజాముద్దీన్ వైద్యవిద్య కోసం ఉక్రెయిన్ వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ యుద్ధం ప్రారంభం కావడంతో దేశం కాని దేశంలో చిక్కుకున్న కొడుకు కోసం రజియా ఆందోళన చెందుతున్నది.
బోధన్, ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ముప్పవరపు సంధ్యారాణి – నరేందర్ దంపతుల పెద్ద కుమారుడు వినయ్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వైద్య విద్యను చదువుతున్నాడు. 2019లో ఆ దేశానికి వెళ్లగా.. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్నాడు. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వినయ్‌కి ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో తాను క్షేమంగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు వినయ్ వివరించాడు.
కామారెడ్డి, ఫిబ్రవరి 24 : కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పావని – నాగరాజు దంపతుల కుమారుడు వెంకట్ అన్వేశ్తోపాటు మరో విద్యార్థి ఉక్రెయిన్‌లోని జెప్రాటోఫియా మెడికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రస్తుతం బాంబు దాడులు జరుగుతున్న ప్రదేశానికి 450 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు వారు తెలిపారు. నస్రులాబాద్ మండల కేంద్రానికి చెందిన మరో విద్యార్థి సచిన్ గౌడ్ ఉక్రెయిన్‌లో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పడు ఫోన్ చేసి వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నా… కొంత ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 24 : నిజామాబాద్ నగరంలోని కోటగల్లీకి చెందిన న్యూడెమోక్రసీ నాయకుడు ఆకుల పాపయ్య మనుమరాలు గడ్డ మేధ ఉక్రెయిన్‌లో చదువుతున్నది. ఆ దేశ రాజధాని కీవ్ ప్రాంతానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్క్యూ పట్టణంలోని ఓ వైద్యశాలలో వైద్యవిద్య చదువుతున్నది. ఆరు సంవత్సరాల క్రితం ఉక్రెయిన్ వెళ్లిన ఆమె.. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్నది. ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కుటుంబీకులు భయాందోళన చెందుతున్నారు. ఆమె తాత పాపయ్య, తల్లి అరుణ ఆమెతో గురువారం ఫోన్లో మాట్లాడి ఇంటికి తిరిగి రావాలని సూచించారు. తాము ఉండే ప్రాంతంలో ఎలాంటి యుద్ధ వాతావరణం లేదని, భయాందోళన చెందవద్దని కుటుంబీలకు వివరించింది. తాము ఉండే ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని చెప్పింది. మరో మూడు నెలల్లో పరీక్షలు ఉంటాయని, తాను తిరిగి రాలేనని, ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.
బోధన్, ఫిబ్రవరి 24 : ప్రస్తుతం యుద్ధ వాతావరణం అలుముకున్న ఉక్రెయిన్‌లో బోధన్ పట్టణం షర్బతీ కెనాల్‌కు చెందిన వైద్య విద్యార్థి నిజాముద్దీన్ చిక్కుకున్నాడు. నిజాముద్దీన్ వైద్యవిద్యలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న వాతావరణంతో నిజాముద్దీన్ కుటుంబీకులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.
నిజాముద్దీన్ తల్లి రజియా బేగం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2020లో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఆ సమయంలో నిజాముద్దీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూర్ జిల్లాలో చిక్కుకుపోయి బోధన్‌కు తిరిగి రాలేకపోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లి రజియాబేగం.. స్కూటీపై నెల్లూరుకు వెళ్లి, అక్కడి నుంచి తన కుమారుడిని బోధన్‌కు తీసుకువచ్చింది. లాక్డౌన్ సమయంలో రానూ, పోనూ సుమారు 1500 కిలోమీటర్ల మేర స్కూటీపై పయనించి కుమారుడిని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు చేసిన సహసం అప్పట్లో సంచలనం కలిగించింది. మళ్లీ ఉక్రెయిన్‌లో తన కుమారుడు చిక్కుకుపోడంపై రజియాబేగం, కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు