కోటగిరి, జూలై 15: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా పంచాయతీరాజ్ ఈఈ శంకర్రాథోడ్ అధికారులను ఆదేశించారు. పల్లె దవాఖాన కోసం సొంత భవనం నిర్మించినా.. ప్రభుత్వ పాఠశాలలో వైద్యశాలను కొనసాగించడంపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ నెల 11న ‘సర్కారు బడిలో పల్లె దవాఖాన’శీర్షికన కథనం ప్రచురితమైంది.
దీనిపై అధికారులు స్పందించారు. కొత్తపల్లి గ్రామంలో పూర్తయిన పల్లె దవాఖాన భవనాన్ని మంగళవారం పరిశీలించారు. పల్లె దవాఖాన భవనం పూర్తయినప్పటికీ ఎందుకు హ్యాండోవర్ చేసుకోలేదని, పాఠశాలలో ఎందుకు ఉంటున్నారని వైద్య సిబ్బందిని పంచాయతీ రాజ్ ఈఈ శంకర్రాథోడ్ ప్రశ్నించారు. వెంటనే పల్లె దవాఖానను హ్యాండోవర్ చేసుకొని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట స్థానిక ఎంఎల్హెచ్పీ రమణి, కార్యదర్శి స్వప్న, పీఆర్ఏఈ సాయిలు, సిబ్బంది ఉన్నారు.