వినాయక్‌నగర్/కంఠేశ్వర్, ఏప్రిల్ 17: తన మూడున్నరేండ్ల పదవీకాలంలో న్యాయాన్ని అందించడంలో న్యాయవాదుల సహకారం వెలకట్టలేనిదని బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆమెకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సునీత కుంచాల మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించేందుకు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా సమష్టిగా శ్రమించామని అన్నారు. అనంతరం జడ్జిని బార్ ఆధ్వర్యంలో సన్మానించారు.
జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఘనంగా వీడ్కోలు పలికారు. జడ్జిని కలిసి జ్ఞాపికను అందజేశారు.
వినాయక్‌నగర్, ఏప్రిల్ 17: జిల్లాలో పలువురు సీనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హై కోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి.. సికింద్రాబాద్ 11వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటర్ మెజిస్ట్రేట్‌గా బదిలీ అయ్యారు. సీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి ఎన్.శ్రీకాంత్ బాబు..హైదరాబాద్ -1 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటర్ మెజిస్ట్రేట్‌గా వెళ్లనున్నారు.
సీనియర్ సివిల్ జడ్జి ,అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నసీం సుల్తానా.. నాగర్‌కర్నూల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. బోధన్ సీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దేవన్ అజయ్ కుమార్‌ను హైదరాబాద్ 15వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటర్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.