కామారెడ్డి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ‘నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాం, ఎప్పటికప్పుడు వర్షాలపై తహసీల్దార్లతో సమీక్షిస్తున్నామని’ కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం(08468-220069)కు ఫోన్ చేయాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం తీసుకొంటున్న చర్యలపై ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నమస్తే : భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారు ?
కలెక్టర్ : భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేసి, ఎలాంటి సెలవులు తీసుకోవద్దని ఆదేశించాం. పనిచేసే ప్రాంతాల్లోనే ఉద్యోగులు ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని అక్కడి నుంచి పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ఉంచేలా చర్యలు తీసుకున్నాం. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాం.
రాకపోకలకు అంతరాయం, నష్టం వాటిల్లిందా?
ప్రత్యామ్నాయ చర్యలు ఏం తీసుకున్నారు ?
భారీ వర్షాలతో జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. గతేడాది వరదల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా సంతాయిపేట-తాడ్వాయి మధ్య వరద రోడ్డుపై ప్రవహించడంతో 30 మంది చిక్కుకున్న ఘటన చోటు చేసుకున్నది. అలాగే లింగంపేట మండలం షెట్పల్లిలో వాగులో రైతులు చిక్కుకున్నారు. ఈ ఏడాది అలాంటి సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులను అప్రమత్తం చేశాం. వ్యవసాయ పనులకు వెళ్తే జాగ్రత్తగా వెళ్లాలని, వాగులు అడ్డంగా ఉంటే పనులకు వెళ్లకూడదని హెచ్చరించాం. పిట్లం మండలం కుర్తి గ్రామాన్ని దశాబ్దాలుగా మంజీరా నది చుట్టుముట్టే పరిస్థితి ఉండేది. కానీ అక్కడ వంతెన నిర్మాణంతో ప్రస్తుతం ఆ సమస్య తీరింది. రోడ్లపై చెట్లు పడినా, వాగులు పొంగి పొర్లినా, ఆ ప్రాంతానికి వెళ్లకుండా రైతులు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లోకి భారీ ఇన్‌ఫ్లో వస్తున్నది.
వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నందున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అతిసార, డెంగీ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. అందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని దవాఖానలు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బస్తీ, గ్రామ దవాఖానల సిబ్బందిని అప్రమత్తం చేశారు. జ్వరం, జలుబు బారిన పడిన వారి రక్తనమూనాలు సేకరించి వెంటనే జిల్లా కేంద్రానికి పంపాలని సూచించాం. ప్రజలు కలుషిత నీటిని తాగవించవద్దని మనవి చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న మిషన్ భగీరథ జలాలను మాత్రమే తాగాలి. బహిరంగ మార్కెట్లో లభించే ఆహార పదార్థాలను తినకూడదు. ఈగలు, దోమల నుంచి జాగ్రత్త పడాలి.
విద్యుత్తు శాఖ అధికారులకు ఎలాంటి ఆదేశాలిచ్చారు ?
భారీ వర్షాల కారణంగా ప్రజలు విద్యుత్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా స్తంభాలు, తీగలను ఎవరూ తాకవద్దు. కొన్ని ప్రాంతాల్లో తీగలు కింద వేలాడుతుంటా యి. వాటిని వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించాం. ఇండ్లలో విద్యుత్ మీటర్ల వద్ద, బట్టలు ఆరబెట్టే చోట విద్యుత్ వైర్లు తగలకుండాచూసుకోవాలి. ట్రాన్స్‌ఫార్లర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లి పరిశీలించాలని సిబ్బందిని సూచించాం. విద్యుత్ శాఖతోపాటు పోలీసు శాఖ ద్వా రా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం.
వ్యవసాయ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి ?
ఇప్పటికే జిల్లాలోని బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో రైతులు వరి నాట్లు వేసుకున్నారు. మిగితా ప్రాంతాల్లోనూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంద స్తు ప్రణాళిక కారణంగా రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎలాంటి లోటు రాలేదు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వాగులు దాటి పొలాలకు వెళ్లకూడదు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే పొలం పనులకు వెళ్లాలి. గత ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం మంజూరైంది. నిజాంసాగర్‌లోకి పుష్కలంగా నీరు వచ్చింది. కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు నిర్భయంగా పంటలను సాగు చేసుకోవచ్చు.