వినాయక్‌నగర్, సెప్టెంబర్ 28: జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌కు మంచి స్పందన వచ్చింది. కక్షిదారుల మధ్య రాజీ కుదరడంతో వేలాది కేసులకు మోక్షం లభించింది. జిల్లా కోర్టుతో పాటు బోధన్, ఆర్మూర్ కోర్టులో మొత్తం 26,026 కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి వెల్లడించారు.
మరోవైపు, న్యాయ వివాదాలు దీర్ఘకాలం కొనసాగరాదనే లక్ష్యంతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలించిందన్నారు.
కక్షిదారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొని వారి న్యాయ వివాదాలను పరిష్కరించుకునే వెలుసుబాటు కల్పించినట్లు చెప్పారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్‌బాబు, జూనియర్ సివిల్ జడ్జీలు కుష్బు ఉపాధ్యాయ్, గోపికృష్ణ, శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్‌రెడ్డి, బార్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్‌కుమార్ సుబేదార్ తదితరులు పాల్గొన్నారు.