బోధన్, జూలై 3: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. గత పాలకులు ఏనాడూ పోడు భూముల పట్టాల సమస్యను పట్టించుకోలేదన్నారు. బోధన్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నవీపేట్ మండలంలో ని లబ్ధిదారులకు పోడు పట్టాలు, రెంజల్ మండలం తాడ్‌బిలోలి గ్రామంలోని లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 70 ఏండ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ పాలకులు పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వాటిని సాగుచేసుకుంటున్నవారిని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. ఎన్నోఏండ్ల తర్వాత ఈ సమస్యను పరిష్కరించి, పోడు పట్టాలను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని వేలాదిమందికి ప్రయోజనం కలిగిందన్నారు.
బోధన్ నియోజకవర్గంలో అటవీ ప్రాంతం తక్కువగా ఉందని, దీంతో ఒక్కో గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు జరుగుతోందన్నారు. నవీపేట్ మండలంలోని మద్దెపల్లిలో ఐదుగురికి, నందిగాం గ్రామంలో ఇద్దరికి పోడు పట్టాలను ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో మరో 80 మందికి సంబంధించిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. రెంజల్ మండలం తాడ్‌బిలోలికి చెందిన 75 కుటుంబాలకు ఇండ్లస్థలాల పట్టాలు ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, నవీపేట్, రెంజల్ మండలాల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింగ్‌రావు, భూంరెడ్డి, నవీపేట్ ఎంపీపీ శ్రీనివాస్, రైతువిభాగం మండల కన్వీనర్ ఎస్.మాణికేశ్వర్రావు, నాయకులు తెడ్డు పోశెట్టి, సూరిబాబు, సాయాగౌడ్, హరీశ్, మౌలానా, ధనుంజయ్, సర్పంచ్‌లు రవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో వీరముష్టి సంఘం సభ్యుల చేరిక
నవీపేట్ మండలానికి చెందిన వీరముష్టి సంఘ సభ్యులు సోమవారం ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే షకీల్ గులా బీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.