ఖలీల్వాడి అక్టోబర్ 31: టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం బస్సుల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. నేటి నుంచి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత సేవలు ప్రారంభించనున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో నగదు రహిత సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం క్యూఆర్ కోడ్లో టికెట్లు తీసుకోవచ్చని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. డ్రైవర్ వద్ద ఉన్న టిమ్లోనే క్యూ ఆర్ కోడ్ ద్వారా టికెట్ పొందే అవకాశం ఉన్నది. దేశ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్న నేపథ్యంలో బస్సుల్లో క్యూఆర్ కోడ్ని అమలు చేస్తున్నారు. నేటి నుంచి డిజిటల్ సేవలను అందిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సూచించారు. స్మార్ట్ కార్డులతో మరింత సులభంగా టికెట్లు తీసుకోవచ్చని తెలిపారు.