నిజామాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్నదాతలు అల్లాడుతున్నారు. ప్రజాపాలనలో భరోసా లేక ఆగమాగం అవుతున్నారు. పంటల సాగు కష్టతరమైంది. సాఫీగా సాగాల్సిన వ్యవసాయం అష్టకష్టాల మధ్య కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సాగుకు కరెంట్ సక్కగా రావడం లేదు. 24గంటల ఉచిత విద్యుత్ నామ మాత్రంగానే మారింది. సమయానికి ఎరువులు, విత్తనాలు అందడం లేదు. యూరియా సంచి కోసం ప్రాణాలు తెగించి కొట్లాడాల్సి వస్తోంది. యాప్ పేరిట తెచ్చిన కొత్త నిబంధన తలపోటుగా మారింది. సాగుకు నీళ్లు కరువయ్యాయి. పెట్టుబడికి సాయం అరకొరగానే అందుతోంది. పెట్టుబడి ఖర్చులు పెరిగి నష్టాలు మినహా లాభాలు గగనమైంది.
ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు ఎదురవుతోన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అకాల వర్షాలు మూలంగా ఆరుగాలం శ్రమించిన కష్టమంతా మట్టిపాలవుతోంది. తడిసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ధాన్యం కుప్పలు పోసి కాంటాల కోసం వేచి చూడటం, కాంటాలు వేసిన తర్వాత లారీల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు ముప్పు తిప్పలు తప్పడం లేదు. అయినప్పటికీ కర్షకుల కన్నీళ్లను తుడిచేందుకు పాలకులు కనికరం చూపించడం లేదు. కనీసం సమీక్షలు, సమావేశాలు పెట్టడం లేదు. యంత్రాంగాన్ని పరుగులు తీయించడం లేదు. రైతు బాధను రైతుకే వదిలేయడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు. రైతు పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉండి పోతోంది. పరోక్షంగా కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తోందన్నదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
రైతుకు అరిగోస…
రెండున్నరేళ్ల ప్రజాపాలనలో రైతులకు వింత అనుభవం ఎదురవుతోంది. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పాలనలో రైతుకు ఇసుమంతైనా ఇబ్బంది వాటిల్లలేదు. సమయానికి ఎరువులు, విత్తనాలు, నిరంతరం ఉచిత విద్యుత్, బీడు భూములకు సాగు నీళ్లు, పుష్కలంగా చెరువుల్లో నీటి మట్టం, ఉబికి వచ్చే భూగర్భ జలం ఇలా చెప్పుకుంటూ పోతే పంటల సాగు ఒక పండుగలా కనిపించేది. రైతు ముఖంలో హుషారు ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా ఆవిరి అయిపోయింది. రైతుకు దినదిన గండం మాదిరిగానే వ్యవసాయం మారి పోయింది. ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. కనీస సౌకర్యాలు సమయానికి చేకూరడం లేదు. యూరియా కోసం రేవంత్ రెడ్డి పరిపాలనలో భారీ వరుసలతో రైతులు డీలా పడాల్సి వచ్చింది.
ఒకప్పుడు ఆటో డ్రైవర్‌కు డబ్బులిస్తే పొలం గెట్ల వద్ద సంచులు దింపేది. ఇప్పుడు డబ్బులు చేతిలో పట్టుకుని తిరిగితే కూడా చేతికి ఒక్క సంచి రావడం లేదు. యూరియా బస్తా కోసం యాప్‌లో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. యాసంగిలో రైతులకు మందు సంచి కోసం తిప్పలు పడ్డారు. వచ్చే వానాకాలంలో యూరియా ఇబ్బంది తీవ్రరూపం దాల్చనున్నట్లుగా తెలుస్తోంది. వానాకాలానికి రైతులు సన్నద్ధం అవుతోన్న ఈ క్రమంలో ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. తటాకాలు, జలాశయాల్లో అనేక చోట్ల నీటి మట్టం తగ్గుతోంది. వానాకాలంలో వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి ఎలా? అన్నది అంతు చిక్కడం లేదు. పాలకుల్లోనూ బాధ్యత, ముందు చూపు అన్నదే కానరావడం లేదు.

Nizabad2
బాసటగా బీఆర్ఎస్…
ప్రజాపాలనలో నిర్లక్ష్యానికి గురవుతోన్న రైతులకు భారత రాష్ట్ర సమితి బాసటగా నిలుస్తోంది. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోవడం లేదు. మాటలు కోటలు దాటితే… చేతలు గడప దాటడం లేదన్న రీతిలో రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఏటా మూడు పంట కాలాలకు రైతుబంధు ఇవ్వాలని పీసీసీ చీఫ్ హోదాలో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి… నేడు ఏటా రెండు సీజన్లకు సరిగా పెట్టుబడి సాయం అందివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు కేసీఆర్ హయాంలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దండగ అన్నట్లుగా మార్చారని అభిప్రాయ పడుతున్నారు. అప్పులు చేసి పంట పండిస్తే శనగ, కందులు, మొక్కజొన్న, పసుపు, ధాన్యం పంటలను సేకరించేందుకు కాంగ్రెస్ సర్కారు సుముఖత చూపడం లేదని రైతులు గుర్తించారు. కాంగ్రెస్ పాలనలో ఆదరణకు నోచుకోలేక పోతున్న అన్నదాతలను ఆదుకునేందుకు వారి తరపున పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేయడంతో పాటుగా సక్రమంగా కొనుగోళ్లు జరిగే విధంగా పాటుపడేందుకు గులాబీ పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. ఇప్పటికే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జీవన్ రెడ్డి, జాజాల సురేందర్‌లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతులకు ధైర్యం చెబుతున్నారు.
బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగుండె
ఎల్లారెడ్డి రూరల్, మే 11: కేసీఆర్ ప్రభుత్వమున్నప్పుడే మంచిగుండె. యూరియాకైతే ఇప్పుడు మస్తు తిప్పలైతుంది. యాప్ అని పెట్టిండు. యాప్‌లో తొందరగా బుక్ కాదు. యాప్‌లో బుక్ కాకపోతే సొసైటీ వాళ్లు యూరియా ఇస్తలేరు. వచ్చిన యూరియా ఎటుపోతుందో తెలుస్తలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత అధ్వాన్నంగా లేకుండే. జెరంత సేపు లైన్లో నిలబడ్డా గ్యారంటీగా యూరియా దొరకుతదని నమ్మకముంటుండె. ఇప్పుడు యూరియా సంచులు చేతికి వచ్చే సరికి పాణం మీదికి వస్తుంది
-జక్కుల యాదగిరి, రైతు – ఎల్లారెడ్డి
ఇప్పటికీ సగం ధాన్యం కొనుగోళ్లు అయిపోతుండె..
బీఆర్ఎస్ ప్రభుత్వముంటే ఇప్పటికీ సగం ధాన్యం కొనుగోళ్లు అయిపోతుండే. ధాన్యం కోసి నెలరోజులవుతున్నా పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కావడం లేదు. అయితే లేబర్ సమస్య ఉంటుంది. మెల్లిగా తూకం ప్రారంభం అయిందంటే, లారీలు కావలసినన్ని అస్తలేవు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి అరిగోసలు పడ్తున్నం. కేసీఆర్ సార్ అయితే ఇప్పటికి ధాన్యం అమ్మేస్తుంటిమి, ఖాతాలల్ల పైసలు కూడా పడ్తుండె. ఆ దినాలే ముంచిగున్నయి.
-పెరుగు నాగరాజు, రైతు, అన్నాసాగర్
రైతుబంధు కరెక్ట్‌గా పడుతలేదు
బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు ఠంఛనుగా పడుతుండె. రైతు అప్పులపాలు కాకుండా ప్రభుత్వం సమయానికి రైతుబంధు డబ్బులను అందజేసి ఆదుకుంటుండె. ఒక రైతుకు నాలుగు ఎకరాలు ఉంటే ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున 20వేలు ఒకేసారి ఖాతాలో పడుతుండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎకరాకు రూ. 6వేలు ఇస్తమన్నరు కానీ సరిగ్గా పడ్తలేవు. నాలుగెకరాలు ఉన్న రైతులకు ఒక్క ఎకరా పైసలే వేస్తుండ్రు. ఏది ఏమైనా కేసీఆర్ సార్ రైతు పక్షపాతి.
-ఎరుకల సాయిలు, రైతు, దేవునిపల్లి