కోటగిరి/ రామారెడ్డి, ఏప్రిల్ 22: వడ్లను కాంటా చేయడంలేదని, కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ కోటగిరి మండలం ఎత్తొండ, రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌లో రైతులు మంగళవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. కోటగిరి మండలం ఎత్తొండ విండో సిబ్బంది ధాన్యం కాంటా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హమాలీలు, గన్నీ సంచుల కొరత ఉన్నదని, లారీ లు కూడా రావడంలేదని ఎత్తొండ గ్రామ రైతులు ఆరోపించారు. వడ్లు ఆరబోసి 15 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ కాంటా చేయలేదని, సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు న్యాయం చేయాలని కోరు తూ ఎత్తొండ గ్రామానికి చెందిన రైతులు కోటగిరి తహసీల్ ఆఫీస్‌కు చేరుకొని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు కోటగిరి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేపట్టి, తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. మండుటెండలోనే రైతులు రోడ్డుపై బైఠాయించారు.
లారీలు రాకపోవడంతో ఎండలో ధాన్యం ఉండడంతో ఐదు కిలోల తరుగు వస్తుందని వాపోయారు. కోటగిరి ఎస్సై సునీల్ సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకొని, తహసీల్దార్ గంగాధర్‌తో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించారు. రైతులను సముదాయించి తహసీల్ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. తహసీల్దార్ గంగాధర్ ఎదుట రైతులు వారి గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన తహసీల్దార్ వడ్లను కాంటా చేస్తామని, లారీలు, హమాలీల కొరత తీరుస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు అగ్గు హన్మంత్, జగదీశ్, శ్యామ్, దశరథ్, శంకర్,జలయ్య, సాయిలు, నర్సిం హులు, పెద్ద హన్మంతు, అల్లాద్దీన్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు తీసుకువస్తే ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదంటూ రామారెడ్డి మండలం రెడ్డిపేట్ లో రైతులు మంగళవారం సాయం త్రం ఆందోళన చేపట్టారు. ధాన్యం తీసుకువచ్చి నెలరోజులవుతున్నా కొనుగోలు చేయడంలేదంటూ సబ్‌స్టేషన్ వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతోఎస్సై నరేశ్ వెంటనే అధికారులో మాట్లాడి రైతులను శాంతింపజేశారు. బుధవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.