ROKO |భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉండే ఈ కాంట్రాక్టుల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈసారి ఏ+ గ్రేడ్‌ను పూర్తిగా రద్దు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో ఏ+ కేటగిరీలో ఉన్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను గ్రేడ్ బీలోకి మార్చడం కూడా విశేషంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయి కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
గ్రేడ్ ఏలో ముగ్గురికే చోటు
తాజా జాబితా ప్రకారం అత్యున్నత గ్రేడ్ అయిన గ్రేడ్ ఏలో కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభించింది. వారు శుభ్‌మన్ గిల్ (టెస్ట్, వన్డే కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా. ఇక గ్రేడ్ బీ కేటగిరీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నారు. సీనియారిటీతో పాటు ఫార్మాట్ పరిమితులు కూడా ఈ విభజనలో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గ్రేడ్ సీ కేటగిరీలో యువ, మిడిల్ ఆర్డర్ ప్లేయర్లకు ప్రాధాన్యం ఇచ్చింది బీసీసీఐ. అక్షర్ పటేల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దుబే, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, ధృవ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి పలువురు ఇందులో చోటు సంపాదించారు.
మొత్తంగా 30 మంది పురుష క్రికెటర్లకు సెంట్రల్ కాంట్రాక్టులు మంజూరు చేసింది బీసీసీఐ. గత సీజన్లో గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీకి రూ.3 కోట్లు, గ్రేడ్ సీకి రూ.1 కోటి వార్షిక వేతనం ఉండేది. అయితే ఈ సారి వేతన నిర్మాణంలో మార్పులపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఆటగాళ్ల గత ప్రదర్శన, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగానే కాంట్రాక్టులను నిర్ణయించినట్లు బోర్డు తెలిపింది.
మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులు కూడా ప్రకటింపు
మహిళా క్రికెట్ విభాగంలో మొత్తం 21 మంది ప్లేయర్లకు కాంట్రాక్టులు దక్కాయి.
గ్రేడ్ ఏ: హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్
ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జెమిమా బీ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోషన్ పొందింది.
గ్రేడ్ బీ: స్నేహ్ రాణా ప్రమోషన్ పొందగా, షెఫాలి వర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్‌తో కలిసి కొనసాగనుంది.
ప్రస్తుతం మహిళా క్రికెటర్ల వేతన నిర్మాణం ప్రకారం గ్రేడ్ ఏకు రూ.50 లక్షలు, బీకి రూ.30 లక్షలు, సీకి రూ.10 లక్షలు అందుతున్నాయి. మొత్తంగా ఈ కాంట్రాక్ట్ జాబితా ద్వారా బీసీసీఐ భవిష్యత్ జట్టును యువతరం వైపు మళ్లిస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.