Nithin | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్లో మరో కీలక మలుపు తిరగబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘భీష్మ’ తర్వాత సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న నితిన్, వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం అందుకోవడం లేదు. గత ఐదేళ్లలో చేసిన ఏడు చిత్రాల్లో ఒక్కటీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. గతేడాది విడుదలైన ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులు కూడా నిరాశ చెందాల్సి వచ్చింది. దీంతో నితిన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది.ఈ నేపథ్యంలో నితిన్ బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్రాజెక్టులకు కమిట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా తన కెరీర్లో 36వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వర్సటైల్ డైరెక్టర్ వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం. ఇప్పటివరకు చూడని కొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో నితిన్ పాత్రపై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ‘నితిన్ 36’ అన్నదమ్ముల కథాంశంతో తెరకెక్కుతుందనీ, ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నితిన్ గతంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రంలో డబుల్ రోల్ చేశారు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉంటే వీఐ ఆనంద్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే నితిన్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ‘ఆయ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అంజి కె. మణిపుత్ర తన తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన నితిన్‌కు ఓ కథ వినిపించగా, హీరోకు నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను నితిన్ తన స్వంత బ్యానర్ ‘శ్రేష్ఠ మూవీస్’ పై నిర్మించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తున్న విషయం ఏంటంటే ముందుగా ఏ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది? వీఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ సినిమానా, లేక అంజి మణిపుత్ర కథానా? ఏది ముందుకు వచ్చినా నితిన్‌కు ఈ రెండు సినిమాలు కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతాయనే ఆశాభావం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.