Tharun Bhascker | రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల మధ్య ప్రేమ గురించి సోషల్ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందనే గాసిప్స్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఫిబ్రవరిలోనే పెళ్లి అని, వేదిక ఉదయ్‌పూర్ అంటూ కొత్త కథనాలు వినిపించడంతో ఈ అంశం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు విజయ్ గానీ, రష్మిక గానీ ఎక్కడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, పిట్టకథలు, కీడా కోలా వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇటీవల నటుడిగా కూడా పలు ప్రాజెక్టుల్లో కనిపిస్తూ బిజీగా ఉన్న ఆయన, ప్రస్తుతం ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు విజయ్–రష్మికల పెళ్లి వార్తల గురించి తరుణ్ భాస్కర్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సరదాగా స్పందిస్తూ, “నాకు ఇంకా ఆహ్వానం రాలేదు. ఒకవేళ ఇన్విటేషన్ వస్తే మీకు వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేస్తా… ఇద్దరం కలిసి వెళ్దాం” అని చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి.
తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలు సరదాగా ఉన్నప్పటికీ, విజయ్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కావడంతో ఆయన మాటలు నెటిజన్లలో ఆసక్తి రేకెత్తించాయి. నిజంగానే వీరిద్దరి వివాహం జరుగుతుందా? లేక ఇవన్నీ గాసిప్సేనా? అన్న సందేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ చర్చలు కొనసాగుతాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, తరుణ్ భాస్కర్..ఇటీవల ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో హీరోగా నటించారు తరుణ్ భాస్కర్. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్. అయితే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోగా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. తాజాగా తరుణ్ భాస్కర్ నటిస్తోన్న మరో చిత్రం గాయపడ్డ సింహం. రీసెంట్గా టీజర్ విడుదల కాగా, ఇది అంచనాలు పెంచింది.