భీమ్గల్, నవంబర్ 5: మండలంలోని నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లింబాద్రి గుట్టపై లక్ష్మీ నరసింహుని రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. రథోత్సవం సందర్భంగా జాతర ఏర్పాటు చేయగా, దుకాణాలు వెలిశాయి. శ్రీ లక్ష్మీనృసింహుల మూల విరాట్టును దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు.
స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రెండు రోజుల ముందు నుంచే గుట్టపై బస చేశారు. దర్శనానికి సుమారు నాలుగైదు గంటల సమయం పట్టింది. రథోత్సవం, జాతరను పురస్కరించుకుని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో స్థానిక సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సందీప్ ఆద్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.