ఆర్మూర్‌టౌన్, జనవరి 21: ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన బలం అన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, 24 గంటల ఉచిత విద్యుత్, కేసీఆర్ కిట్, వృద్ధులకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ వంటి చారిత్రాత్మక పథకాలు ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు నేటికీ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని అన్నారు.
అదే నమ్మకంతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కే ఓటు వేయనున్నారని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలు ఐక్యతతో పని చేసి కేసీఆర్ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ఇంటింటికీ తీసుకు వెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు పూజ నరేందర్, పోల సుధాకర్, చిన్నారెడ్డి, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ హజీమ్, లతీఫ్, మోహిన్, ఇమ్రాన్, రెహమాన్, షాకీర్, షౌకత్, ఆరీఫ్, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎంపీ సురేశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపారని గుర్తుచేశారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ హాయంలో తెలంగాణ సుందరంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. ఎలాంటి అభివృద్ధి జరుగడం లేదన్నారు.
-ఎంపీ సురేశ్‌రెడ్డి
ఆరు గ్యారెంటీలు ఎటుపోయాయి..?
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఏమయ్యాయో..? ఎటు వైపు ఎగిరిపడ్డాయో సీఎం, మంత్రులు చెప్పాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. ఇచ్చిన హామీలను అమలుచేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదన్నారు. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
-అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా
తులం బంగారం ఏమయ్యింది..?
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామన్న ఎన్నికల హామీ ఏమైందని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పెండ్లి అయిన కొద్ది రోజుల్లోనే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ డబ్బులు అందేవని, ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్నా వారికి లబ్ధి చేకూరడం లేదన్నారు.
-బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదు
రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలకుల మాటలను నమ్మే స్థితిలో లేరని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. వారు చెబుతున్న మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదన్నారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
-మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్