కామారెడ్డి, జూన్ 3: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల ముగింపు వేడుగలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా, గులాబీ జెండాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ మలి విడుత ఉద్యమంలో కేసీఆర్ నేతృత్వంలో పెద్దఎత్తున ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మాచారెడ్డి జడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపీగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు నల్లవెల్లి అశోక్, భూమేశ్ యా దవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.