రుద్రూర్, ఫిబ్రవరి 25: ప్రజల ఆశ్వీరాదం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మండలంలోని రాయకూర్, రాయకూర్ క్యాంపు, సిద్ధాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. మొదట సిద్ధ్దాపూర్ గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక నాయకులతో కలిసి డబుల్‌బెడ్ రూం ఇండ్లతోపాటు డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పోచమ్మ ఆలయానికి రూ. రెండు లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల వినతి మేరకు మరో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. రాయకూర్ క్యాంపులో మంత్రి కొప్పుల ఈశ్వర్ తన సొంత ఖర్చుతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయగా..ఆయనతో కలిసి స్పీకర్ ప్రారంభించారు. అనంతరం జనరల్ ఫంక్షన్‌హాలు నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి చిన్నారులతో ముచ్చటించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పూర్తయిన ఇండ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి మంత్రి, స్పీకర్ రాయకూర్ గ్రామంలో పర్యటించి ఎస్సీ కమ్యూనిటీ హాలు, మున్నూరు కాపు సంఘం, గంగమ్మ ఆలయం, దండోరా సంఘం, పాఠశాల అదనపు తరగతులు, డబల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30 లక్షలతో చేపట్టనున్న జనరల్ ఫంక్షన్‌హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అదనంగా మరో రూ.10లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ: స్పీకర్ పోచారం
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..రాయకూర్ క్యాంపు మంత్రి కొప్పుల ఈశ్వర్ అత్తగారి గ్రామమని, ఇక్కడ మంత్రి సొంత డబ్బులు రూ.10 లక్షలతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. సంక్షేమ పథకాల గురించి ప్రతి నాయకుడు, అధికారి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. సిద్ధాపూర్, రాయకూర్, రాయకూర్ క్యాంపులో అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.2.5 కోట్ల నుంచి మూడు కోట్ల వరకు నిధులు కేటాయించినుట్లు తెలిపారు.
రాష్ట్రంలో 360 సంక్షేమ పథకాలు:మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజా సేవ చేయాలన్న తపన, అంకిత భావం కలిగిన నాయకుడు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నియోజక వర్గంలో రూ.10కోట్లతో అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో 360 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా సీఎం కేసీఆర్‌కు ఉందని, ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టే నిదర్శనమన్నారు. కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్, జడ్పీటీసీ నారోజీ గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాతా నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, కో-ఆప్షన్ సభ్యుడు మస్తాన్, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మణ్, నిర్మల రమేశ్, గంగారాం, ఎంపీటీసీ అనిల్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, సీనియర్ నాయకులు పత్తి రాము, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.