శక్కర్‌నగర్, మే 12: బోధన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఆయా ఏరియాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు వారి ఆటోల వివరాలను పోలీస్స్టేషన్లలో నమోదు చేయించాలని ఏసీపీ కిరణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆటో ఓనర్లు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. బోధన్ ప్రాంతంలో ఆటోలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఆటోలకు చెందిన అన్ని ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. పలు సంఘటనల్లో ఆటోలు కారణంగా మారుతున్నాయని, కొందరు ఆటోల వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఫిర్యాదులు వస్తూన్నాయని, దీంతో అందరికీ చెడ్డపేరు వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటలనకు దూరంగా ఉండాలని, అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉంచుకుని ఆటోలు నడపాలని, రోడ్లపై పోలీసులు కనబడితే ఆటోలను దూరంగా ఉంచకుండా, తమ ప్రయాణాలు సాఫీగా సాగించుకోవాలని అన్నారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఆటోలకు ట్యాక్సులు రద్దు చేయడంతో పాటు పలు సౌకర్యాలు కల్పించిందని, ఇంతకు ముందు పడిన ఇబ్బందులు ప్రస్తుత పరిస్థితుల్లో లేవని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ఆటోకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా పొందాలని, ఆటోలకు పొల్యూషన్ సర్టిఫికెట్, ఆర్సీ కార్డుతోపాటు, బీమా కూడా చేయించాలన్నారు. ఆటోలు తమకు మాత్రమే కాకుండా అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు కూడా రక్షణగా బీమా పనిచేస్తుందని అన్నారు. ఆటోలు రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నడిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం టీఎన్ స్వామి, బోధన్ పట్టణ, రూరల్ సీఐలు బీడీ ప్రేమ్ కుమార్, జి.శ్రీనివాస రాజుతోపాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి
నందిపేట్, మే 12: మండల కేంద్రంలో ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై శ్రీకాంత్ అవగాహన కల్పించారు. ఇన్చార్జి పోలీసు కమిషనర్ సీహెచ్.ప్రవీణ్‌కుమార్ సూచనల మేరకు ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధిస్తామని అన్నారు. డ్రైవర్ల వివరాలను జిల్లా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు.
లైసెన్స్ ఉన్న వారే ఆటోలు నడపాలి
మాక్లూర్, మే12: ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉండాలని ఎస్సై యాదగిరిగౌడ్ అన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘మై ఆటో మై సేఫ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మండలంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఆటో డైవర్ల వివరాలను సేకరించారు. కార్యక్రమంలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.