ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా బీఆర్ఎస్ విజయం కోసం ధైర్యంగా పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయాపూర్వక అభినందనలు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ శ్రేణులు కనబర్చిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్కు కొండంత బలాన్నిచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల ఉసురు పోసుకున్న పాపాన్ని ముఖ్యమంత్రి మూటగట్టుకున్నారన్నారు. ఓటమి భయంతోనే రేవంత్ సూచనలతో కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికల్లో దౌర్జన్య కాండకు దిగారని ఆరోపించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికారని విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన అరాచకాలకు రేవంత్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.