బోధన్/ఖలీల్‌వాడి, అక్టోబర్ 16: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేపట్టిన నిరవధిక బంద్ కొనసాగుతున్నది. మూడో రోజు బుధవారం కూడా కళాశాలలు తెరచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిజామాబాద్, బోధన్‌లో ప్రైవేట్ కళాశాలల యజమానులు, ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. బోధనా, బోధనేతర సిబ్బంది అందరూ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా ఉద్యోగుల జీతభత్యాలు, భవనాల అద్దె, కళాశాలల నిర్వహణ భారంగా మారిందని యజమానులు వాపోయారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరుబాట పట్టిన ప్రైవేట్ కళాశాలల యజమానులు తమ పోరాటానికి మద్దతు ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌కు వచ్చిన ఆయనను కలిసి తమకు సహకరించాలని కోరారు. స్పందించిన మందకృష్ణ మాదిగ తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మూడురోజులుగా కళాశాలలు బంద్ పాటించడం తెలిసి విచారం వ్యక్తం చేశారు.
డిచ్పల్లి, అక్టోబర్ 16: విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యూనివర్సిటీలో సర్కారు దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దహనం చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. మూడు రోజులుగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ పాటిస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం సరికాదన్నారు. వెంటనే ప్రైవేట్ యాజమాన్యాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు రాచకొండ విఘ్నేశ్, దినేశ్, చక్రి, జీవన్, అశోక్ పాల్గొన్నారు.