శక్కర్‌నగర్, మార్చి 4: బోధన్ పట్టణంలోని బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో దారు ణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఏడుగురు విద్యార్థుల దాడిలో హరియాలి వెంకట్ (23) అనే విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న వెంకట్, వసతిగృహంలోని విద్యార్థులకు నాయకుడిగా ప్రత్యేక తరగతులను పర్యవేక్షించేవాడు.
పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులను చదువుకోవాల్సిందిగా వారిపై కొంత ఒత్తిడి చేయడంతో సదరు విద్యార్థులు క్లాసుల అనంతరం ఆదివారం అర్ధరాత్రి సమయం లో వెంకట్ నిద్రిస్తున్న గదికి వెళ్లి ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఊపిరాడక వెంకట్ మృతి చెందినట్లు గుర్తించిన నిందితులు పరారయ్యే క్రమంలో ఇతర విద్యార్థులు వారిని పట్టుకున్నారు. ఈ విషయమై వార్డెన్ స్వామికి సమాచారం అందించడంతో వెంకట్‌ను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తోటి విద్యార్థుల సమాచారంతో వెంకట్ తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు అర్ధరాత్రి తరలివచ్చి ఆందోళన చేపట్టారు.
సోమవారం ఉద యం వరకు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన కొనసాగింది. తమ కుమారుడిని కావాలనే హతమార్చారని వెంకట్ కుటుంబీకులు ఆరోపించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. బాధి త కుటుంబానికి న్యాయం చేస్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. వెంకట్ తండ్రి హరియాల జగ్గు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వెంకట్‌పై దాడి చేసి, అతని చావుకు కారణమైన ఏడుగురు విద్యార్థులను పోలీసులు గుర్తించారు. ముందుగా ఆరుగురు దాడికి పాల్పడినట్లు గుర్తించినా, పోలీసులు విచారణలో మరో విద్యార్థిని కూడా గుర్తించారు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి మాస్ కాపీయింగ్ కోసం చిట్టీలను తయారు చేస్తుండగా గుర్తించిన వెంకట్ సదరు విద్యార్థిని బెదిరించాడు.
దీంతో ఆ విద్యార్థి అదే వసతిగృహంలో ఉంటున్న వరుసకు సోదరుడైన దిలీప్‌కు ఈ విషయాన్ని వివరించాడు. ఇంటర్ సెకండియర్ విద్యార్థులైన దిలీప్, కృష్ణ, లక్ష్మణ్, డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు పరమేశ్, నితిన్, శివకుమార్‌తోపాటు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి కలిసి వెంకట్‌పై దాడికి పాల్పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బి.వీరయ్య తెలిపారు.