కామారెడ్డి, నవంబర్ 29:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్, బీజేపీలపై పోరాడాలని, ఆ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయని, ఆయన ఆనవాళ్లను ఎవరూ చెరపలేరని స్పష్టం చేశారు. స్వార్థం కోసం తల్లిలాంటి బీఆర్ఎస్ను వీడిన నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో దీక్షాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమ ఇన్చార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, శోభ తదితరులు నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఉన్న తెలంగాణ తల్లి, కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యకన్వెన్షన్లో ఏర్పాటు చేసిన దీక్షాదివస్ కార్యక్రమంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ చేసిన పోరాట గాథను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. అమరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
తల్లి లాంటి పార్టీని మోసం చేసిన వారిపై తిరుగుబాటు చేసి తరిమికొట్టాలని దీక్షాదివస్ కార్యక్రమ ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు. ఇప్పుడు ఇక్కడున్న వారిని చూస్తే బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమిటో అని తెలుస్తుందన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు ఎవరూ కూడా తీసేయలేరని స్పష్టం చేశారు. పోచారం కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు పార్టీ పనైపోయిందని అన్నావు కదా.. ఈ దీక్షా దివస్‌కు మీ బాన్సువాడ నుంచే 500 మంది వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కూటమిగా మారి బాన్సువాడ కార్యకర్తలను ఈ సమావేశానికి రాకుండా చిత్రహింసలకు గురి చేసినా మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో 500 మందికి పైగా కార్యకర్తలు తరలిరావడం అభినందనీయమన్నారు.
తాను ఇక్కడికి పరిశీలకుడిగా కాకుండా విద్యార్థిలాగా వచ్చానని చెప్పారు. నాయకుల పోరాట పటిమ నుంచి స్ఫూర్తిని నింపుకోవడానికి వచ్చాన్నారు. కామారెడ్డి గడ్డ ఎన్నో ఉద్యమాలకు పురిటి గడ్డ అని అన్నారు. తెలంగాణ రావడానికి మూల కారకుడైన పోరాట యోధుడు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శవయాత్ర అని నవంబర్ 29వ తేదీ నాడు ఆమరణదీక్షకు పూనుకున్నాడని తెలిపారు. తెలంగాణ కోసం ఎంతో మంది పోరాటాలు చేసినా రాష్ట్రం మాత్రం సాధించలేక పోయారని, కానీ కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించాడని చెప్పారు. కేసీఆర్ త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపైనా ఉందన్నారు.
కేసీఆర్‌ను లొంగదీసుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. కల్వకుంట్ల కవితపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపితే కేసీఆర్ లొంగుతాడని భావించారు. అయినా కేసీఆర్ లొంగలేదని గుర్తు చేశారు. ఎన్నో కుట్రలు, అవమానాలను ఎదుర్కొని తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఆయన త్యాగం చేయకుంటే ఈ రోజుకూ తెలంగాణ వచ్చేది కాదన్నారు. దేశంలోనే గొప్పగా పాలించిన పరిపాలనాదక్షుడు కేసీఆర్ అని ప్రశంసించారు. బంగారు తెలంగాణ ప్రమాదంలో ఉందని, దీనిని కాపాడుకోవాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసి వారి గురించి కూడా తెలియజేయాలన్నారు. ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. కేటీఆర్ ప్రశ్నించకపోతే రేవంత్‌రెడ్డి రూ.12,300 కోట్లను అదానీకి అప్పనంగా అప్పగించే వాడని చెప్పారు.
విద్యార్థుల ఆత్మబలిదానాలకు చలించిపోయిన కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు అన్నారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న పంతంతో ఆయన చేపట్టిన దీక్షతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధమైన కేసీఆర్ గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ అన్నారు. కేసీఆర్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ అన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రిగా, స్పీకర్‌గా అవకాశమిచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోచారం వ్యక్తిగత అవసరాల కోసం బీఆర్ఎస్ను వీడారని మండిపడ్డారు. బాన్సువాడలో పోచారం కుటుంబ సభ్యులు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారని, కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారన్నారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీఆర్ఎస్ నేతలు వేణుగోపాల్‌గౌడ్, ప్రేమ్‌కుమార్, జూకంటి ప్రభాకర్‌రెడ్డి, నల్లవెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దీంతో కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు. సీమాంధ్ర నేతలు, పోలీసులు భగ్నం చేయాలని ఎంత ప్రయత్నించినా ఆయన పట్టు వీడలేదు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష కొనసాగించారు. కేసీఆర్ దీక్ష మూలంగా తెలంగాణ అగ్నిగుండంగా మారుతుండడంతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ ఏర్పాటు చేస్తామని డిసెంబర్ 9న ప్రకటించింది. కానీ సీమాంధ్రుల ఒత్తిడికి కాంగ్రెస్ పార్టీ తలొగ్గడంతో కేసీఆర్ మరోసారి ఉద్యమబాట పట్టారు.
8
కులమతాలకు అతీతంగా సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణను సాధించారు. పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. కానీ, కాంగ్రెస్ రావడంతో పరిస్థితి మారిపోయింది. తెలంగాణను కాపాడుకోవాల్సి బాధ్యత మనందరిపై ఉంది. కేంద్రంలో బీజేపీ 11 ఏండ్లుగా అధికారంలో ఉన్నా తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. కానీ పదేండ్లలో కేసీఆర్ ఎన్నో ప్రాజెక్టులను కట్టారు. ప్రపంచ పటంలో తెలంగాణకు చోటు దక్కేలా చేశారు.
గజ్వేల్ సభలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని అభినందించిన ప్రధాని మోదీ ఇప్పుడు మాట మార్చుతారా? అని నోరా.. మోరా? తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్. పల్లెలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ వాళ్లకు కనిపిస్తలేదా? లేనిపోని ఆరోపణలతో బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలంటూ అర్రాసు పాట పాడి, మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఏమాత్రం హుందాతనం లేని రేవంత్‌రెడ్డి అసలు సీఎంలాగే కనబడడం లేదు. ఎన్నికల ముందర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాల్సిందే. అప్పటిదాకా బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్‌ను నిలదీస్తూనే ఉంటాం.
– గంప గోవర్ధన్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే
తెలంగాణకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే. 1600 మంది విద్యార్థులను బలిగొన్న పార్టీ అది. తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2009 నవంబర్ 29 చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయ నేతలందరి దృష్టిని తెలంగాణ వైపు తిప్పింది. కేసీఆర్ తన ఆమరణ దీక్షతో కేంద్రం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే 29వ తేదీన దీక్షాదివస్ నిర్వహిస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన త్యాగాలను, కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాకపోతే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడా? మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పలేక అధికారం కోల్పోయాం. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే