మాచారెడ్డి, మే 19 : గ్రామ గ్రామాన పచ్చదనం పెంపొందించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఎన్నో రకాల పూల మొక్కలను నాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇందులోనే వాకర్స్ కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. దీంతో ప్రకృతి వనాలు పట్టణాల్లోని పార్కులకు దీటుగా మారాయి. గ్రామస్తులకు ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనాలను ప్రస్తుతం పట్టించుకునే వారే కరువయ్యారు. పర్యవేక్షణ కరవవడంతో పచ్చని మొక్కలు ఎండిపోయి ఆకులు రాలిపోతున్నాయి.
కాకులగుట్టతండా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కళాహీనంగా మారింది. గేటు ఉన్నా చుట్టు ఫెన్సింగ్ లేకపోవడంతో మందుబాబులు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకృతి వనంపై అధికారులు కనీసం దృష్టిసారించడంలేదు.
పచ్చగా ఉండాల్సిన ప్రకృతి వనం నేడు కళా విహీనంగా మారడంతో తండావాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి పోవడంతో గ్రామాల అభివృద్ధికి ప్రస్తుతం ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికైనా వారు స్పందించి పల్లె ప్రకృతి వనాలను గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.