Jeevan Reddy | నిజామాబాద్, ఆగస్టు15: కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపి పదేళ్లలో కేసీఆర్ తెచ్చిన స్వర్ణ యుగం కాంగ్రెస్ రాబందుల పాలవుతుందని ఎవరూ ఊహించ లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంగా మారి బానిసత్వ శక్తుల కబంధ హస్తాల నుంచి బయటపడిన సంతోషం పట్టుమని పదేళ్లలోనే మాయ మైందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల హక్కులను హరించి బతికే కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేరుతో అదే బానిసత్వం, అదే అణచివేత మళ్లీ తెలంగాణలో కరాళ నృత్యం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అవే మోసాలు కొనసాగిస్తూ ప్రజలను అదే గోస పెడుతోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. విదేశీ సంతతికి చెందిన కాంగ్రెస్ బ్రిటిష్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అభినవ ఈస్టిండియా కంపెనీ అవతారమెత్తి దోచుకుతింటున్నదని ఆయనఆరోపించారు.బీజేపీ ఒక నార్తిండియా కంపెనీ అని ఆయన పేర్కొంటూ కాంగ్రెస్, బీజేపీ రెండూ దోపిడీ, దగాకోరు కంపెనీలేనని విమర్శించారు. కాంగ్రెస్ అవినీతి, బీజేపీ దుర్నీతికి తెలంగాణ ప్రయోగశాలగా మారిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు తెలంగాణను నిలువునా దోపిడీ చేస్తూ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ తెలంగాణ పట్ల దుర్నీతి ప్రదర్శిస్తూ తెలంగాణపై పగ పెంచుకొని దగా చేస్తోందన్నారు. తెలంగాణకు దక్కాల్సిన సెమీకండక్టర్ పరిశ్రమ ఏపీకి తరలించి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన బీజేపీకి తెలంగాణలో ఉండే అర్హత ఉందా?అని జీవన్ రెడ్డి నిలదీశారు.
తెలంగాణపై కొనసాగుతున్న మోదీ సర్కారు వివక్ష పై నోరువిప్పని రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వైఖరి సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణ అంటేనే కడుపులో కత్తులు పెట్టుకున్నట్టు, కండ్లల్లో కక్ష నింపుకొన్నట్టు వ్యవహరించే కాంగ్రెస్-బీజేపీ ద్వయం నిజరూపాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు. నాటి ఆంగ్లేయుల వంకర బుద్దే నేటి కాంగీయులదని, అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను సమాధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గొంతు నులిమే తీరు చూస్తుంటే అసలు గాంధీజీ మార్గం కాకుండా గాడ్ సే పద్దతి అనుసరిస్తు న్నట్టు కనిపిస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ కిరాయి, బీజేపీ పరాయి పార్టీ అని ఆయన అభివర్ణించా రు. తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసేలా ఢిల్లీ పెత్తనం చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ నుంచి తరిమికొట్టేందుకు ప్రజలంతా మరో సంగ్రామానికి సంసిద్ధులు కావాల్సిన సమయం ఆసన్నమైందని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.