పాల రైతును రేవంత్ సర్కారు పరేషాన్ చేస్తున్నది. రైతుభరోసా ఇవ్వకుండా అన్నదాతలను ఆగం చేసిన ప్రభుత్వం.. పాల బిల్లులు చెల్లించక పాడి రైతులను అవస్థల పాలు చేస్తున్నది. పక్షం రోజులకోసారి డబ్బులు చెల్లించాల్సి ఉండగా, మూడు నెలలుగా ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నది. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే తమకు కష్టాలు మొదలయ్యాయని వాపోతున్నారు. సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తాజాగా తాడ్వాయిలో రోడ్డెక్కారు. బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు.
-నిజామాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నడిచే విజయ డెయిరీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తుంది. పాల కేంద్రాల నుంచి శీతలీకరణ కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి ప్యాకెట్ల ద్వారా టోన్డ్ పాలను సరఫరా చేస్తుంటారు. బహిరంగ మార్కెట్లో ప్రజలకు పాల ప్యాకెట్లను విక్రయించి విజయ డెయిరీ వ్యాపారం చేస్తుంటుంది. అలాగే, పాల నుంచి తీసే కొవ్వుతో నెయ్యి, ఇతరత్రా పదార్థాలను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. అలా వచ్చిన డబ్బులను 15 రోజులకోసారి పాల రైతులకు చెల్లించేది. కేసీఆర్ హయాంలో ఠంచన్‌గా బిల్లులు మంజూరయ్యేవి. కానీ, కాంగ్రెస్ సర్కారు రాకతో పాడి రైతులకు పరేషన్ మొదలైంది. సమయానికి పాల డబ్బు లు రాక ఆగమవుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 15 వేల మంది రైతుల పేర్లు విజయ డెయిరీలో నమోదై ఉన్నాయి. పాల సీజన్‌గా పరిగణించే సెప్టెంబర్ – ఫిబ్రవరి మధ్య కాలంలో దాదాపు పది వేల మంది పాలను విక్రయిస్తున్నారు. అన్‌సీజన్‌లో అంటే మార్చి – ఆగస్టు వరకు 5 వేల మంది మాత్రమే పాలు పోస్తుంటారు. పక్షం రోజులకోసారి బిల్లులు చెల్లించాల్సిన విజయ డెయిరీ మూడు నెలలుగా పాడి రైతులకు చుక్కలు చూపిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలోని వేలాది మందికి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి 5 బిల్లులు చెల్లించాల్సి ఉంది. రూ.లక్షల్లో బిల్లులు పేరుకుపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతుల నుంచి సేకరించే పాలతో వ్యాపారం చేస్తున్న విజయ డెయిరీ వారికి ఇవ్వాల్సిన డబ్బులను మాత్రం ఇవ్వడం లేదు. పాల డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తే సరైన సమాధానాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలంగా పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనున్నది. గతంలో కేసీఆర్ సర్కారు పాడి రైతులను విరివిగా ప్రోత్సహించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాల అవసరాలను తీర్చేందుకు విజయ డెయిరీని బలోపేతం చేశారు. కానీ ఇప్పుడు పాడి రైతులకు ప్రోత్సాహం కరువైంది. వారికి పాల డబ్బులే సమయానికి ఇవ్వకపోగా నెలల కొద్దీ బిల్లులు పెండింగ్‌లో పెట్టడం ద్వారా రైతులంతా గందరగోళంలో ఉన్నారు.
బ్యాంకుల్లో, మహిళా సంఘాల్లో, వడ్డీ వ్యాపారుల దగ్గర పాడి రైతులు చేసిన అప్పులకు క్రమం తప్పకుండా కిస్తీలు కట్టాల్సి ఉండగా, డబ్బల్లేక ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, పశువులకు దాణా, మిండ్రాల్ మిక్చర్, కాల్షియం, మందుల కొనుగోలుకూ చిల్లిగవ్వ లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పశువుల పోషణపై తీవ్ర ప్రభావం చూపి, పాల ఉత్పత్తికి ఆటంకం కలిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు.
కోటగిరి, సెప్టెంబర్ 23: ప్రభు త్వం, అధికారుల నిర్లక్ష్యంతో అనేక కష్టాలు పడుతున్నాం. 15 రోజులకోసారి పాల బిల్లులు ఇ వ్వాల్సి ఉండే. మూడు నెలల నుంచి ఇస్తలేరు. నాకు రూ.70 వేల కు పైగా రావాలి.. బిల్లులు ఇవ్వకుంటే పశువులకు దా ణా ఎట్లా కొనాలే. కూలీలకు డబ్బులు ఎట్లా ఇయ్యాలే. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలి.
– సుబ్రమణ్యం, పాడి రైతు, కోటగిరి
పాల కేంద్రంలో పాలు పోస్తు న్నాం కానీ ప్రభుత్వం నుంచి బిల్లులైతే అస్తలేవు. పాలు తీసుకుని పైసలు ఇయ్యకుంటే ఎట్లా? నాకు రూ.45 వేలకు పైగా డబ్బులు అచ్చేది ఉన్నది. అధికారులు స్పందించి నాలుగు విడతల బిల్లులు వెంటనే ఇవ్వాలి.
– రమేశ్, పాడి రైతు కోటగిరి
పాల రైతులకు ఎప్పటికప్పుడు బిల్లులు రావాల్సి ఉండే. కానీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రంలో పాలు పోసే రైతులకు రూ.3లక్షలు బిల్లులు వచ్చేవి ఉన్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా నాలుగు బిల్లులు రావాలె. ప్రభుత్వం, అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి.
– దమ్మలపాటి ఉదయ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు, మిర్జాపూర్క్యాంప్, కోటగిరి