ధర్పల్లి, నవంబర్ 26 : మూడు నెలలుగా పేరుకుపోయిన బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లిలో పాడి రైతులు, విజయ డెయిరీ నిర్వాహకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం మండల కేంద్రంలోని విజయ డెయిరీకి చెందిన పాల శీతల కేంద్రాన్ని ముట్టడించారు.సేకరించిన పాలను కేంద్రం ఎదుట పారబోస్తూ నిరసన వ్యక్తం చేశారు. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, డిచ్పల్లి తదితర మండలాల్లో విజయ డెయిరీ ఆధ్వర్యంలో 43 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమయానికి బిల్లులు రాకపోవడంతో ఆయా గ్రామాల్లోని పాడి రైతులు నిలదీస్తుండడంతో డెయిరీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో ధర్పల్లిలోని కేంద్రానికి వచ్చిన విజయ డెయిరీ సూపర్వైజర్ బ్రహ్మానందంను నిర్వాహకులతోపాటు పాడి రైతులు నిలదీశారు. గత సెప్టెంబర్ నుంచి సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బిల్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ఎదుట పాల డబ్బాలతో ఆందోళన చేపట్టి సేకరించిన పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో సూపర్వైజర్ వెంటనే డీఎంకు ఫోన్‌చేసి పరిస్థితిని వివరించగా.. వారం రోజుల్లోగా బిల్లులు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. వారం రోజుల్లోగా చెల్లించకుంటే పాడి రైతులతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నిర్వాహకులు హెచ్చరించారు.
గడిచిన పదేండ్ల కాలంలో ఎప్పడూ ఇంతపెద్ద మొత్తంలో పాల బిల్లులు నిలిపివేయలేదని కేంద్రాల నిర్వాహకులు, పాడి రైతులు తెలిపారు. మూడు నెలలుగా బిల్లులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు సకాలంలో అందజేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, పాడి రైతులు సంజీవ్, రాజారెడ్డి, లింగం, గణేశ్, నరేందర్, శేఖర్, మానస, శ్రీకాంత్, సాయిలు, సుభాష్, రవీందర్, పవన్, సుదర్శన్, సత్యనారాయణ, గంగాధర్, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.