వినాయక్‌నగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు అందించే సీఎం రిలీఫ్ ఫండ్‌లో ప్రభుత్వం కోత విధించడం అన్యాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే (Nizamabad Urban ) ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Dhanpal Suryanarayana) మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్ఎఫ్ (CMRF Checks) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 66 మందికి రూ.18,93,000 చెక్కులు అందించామని వెల్లడించారు. బాధితులకు ఆసుపత్రుల్లో పెట్టిన ఖర్చులకు దరఖాస్తు చేసుకుంటే వారికి కేవలం 15 శాతం నుంచి 20 శాతం మాత్రమే చెల్లిస్తుందని , దీంతో సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.