పోతంగల్/కోటగిరి, జూలై 18: కార్తెలు కరిగి పోతున్నాయి.. వానలు ముఖం చాటేశాయి. ఎండలు దంచుతుంటే పంటలు ఎండుతున్నాయి. కాలం కలిసి రాకపోవడంతో రైతులకు కన్నీళ్లే దిక్కయ్యాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు తల్లడిల్లిపోతున్నారు. సాగునీరు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చుక్కనీరు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతుండగా, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తి పోతున్నాయి. దీంతో నీళ్లు లేక పంటలు నేలచూపులు చూస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా రైతులు ఎప్పటిలాగే వర్షాలను నమ్ముకుని పంటలు సాగు చేశారు. అయితే, ఈసారి ఎల్నినో రూపంలో వచ్చిన పిడుగు కర్షకుల ఆశలను చిదిమేస్తున్నది. వానాకాలం ప్రారంభమై నెలన్నర దాటుతున్నా వానలు కురవక పోవడంతో ఆందోళనకు లోనవుతున్నారు. కండ్ల ముందే పంటలు ఎండుతుండడంతో దిగాలు చెందుతున్నారు. వరి, మక్క, సోయా, పసుపు, పత్తి, కంది తదితర పంటలు నీరందకు నేలచూపులు చూస్తున్నాయి. తొలకరి చినుకులు పలుకరించడంతో రైతులు ఉత్సాహంగా విత్తనాలు వేశారు.
కొద్దిపాటి వానలతో మక్క, సోయా, పత్తి మొలకెత్తాయి. అయితే, 20 రోజులుగా చినుకు జాడ లేకపోవడం, భూమిలో తేమ శాతం తగ్గడం, ఎండలు దంచికొడుతుండడంతో మొక్కలు వాడిపోతున్నాయి. ఒక్క పోతంగల్ మండలంలోనే 4 వేల ఎకరాల్లో సోయా సాగు చేయగా, నీటి వసతి లేక నేలచూపులు చూస్తున్నాయి. ఎంతో పెట్టుబడి పెట్టి పంటలు వేస్తే వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న కొంత మంది బోర్లతో నీరు పెట్టాలని చూస్తే కరెంటు కోతలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు.
వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు బోసిపోయాయి. కొత్త నీరు రాక, ఉన్న నీరు ఆవిరై తటాకాలు ఎండిపోయాయి. గతేడాది ఇదే సమయానికి నీటితో కళకళలాడిన చెరువులు నేడు కళావిహీనంగా మారాయి. చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. చినుకు జాడ లేక.. ఏం చేయాలో రైతులకు పాలు పోవడం లేదు. ఆకాశంలో మేఘాలు జాడలేకుండా పోయాయి. నారు మడులు బోరుమంటున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వర్షాల కోసం పూజలు, జలాభిషేకాలు చేసి దేవుళ్లను వేడుకుంటున్నారు.