ఉమ్మడి జిల్లాలో చేతికివచ్చే దశలో పంటలు ఎండిపోవడం రైతులను బాధిస్తున్నది. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి సాగుచేస్తున్న పంటలు నీరందక ఎండిపోతున్నాయి. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. అందుబాటులో ఉన్న జలవనరులను ఉపయోగించుకోవాలనుకుంటున్నా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో వాటిల్లోనూ నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి.
కనీసం బోర్ల ద్వారా పంటను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేయించగా.. నీటి జాడలు కనిపించని దుస్థితి నెలకొన్నది. ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో రైతులు సాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందల్వాయి మండలంలోని ప్రతి గ్రామంలో కనీసం 20 ఎకరాల్లో సాగునీరందక పంటలు ఎండిపోయినట్లు తెలుస్తోంది. వరి పంటపొట్ట దశలోనే ఎండిపోతున్నది.
-ఇందల్వాయి/ ధర్పల్లి, మార్చి 12
ఒక్కో రైతు కనీసం నాలుగెకరాల వరకు పంట నష్టపోయాడు. పంటను కాపాడుకోవడానికి చివరి ప్రయత్నంగా బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. సగటున 650, 700 ఫీట్ల లోతువరకు బోరుబావులు వేయించినా చుక్కనీరు రాకపోవడంతో బోర్లతోపాటు పంటకు వెచ్చించిన డబ్బులు వృథా అవుతున్నాయని రైతులు గుండెలు బాదుకుంటున్నారు.కొన్ని బోర్లు కుళాయి నీటి కన్నా అధ్వాన్నంగా పోస్తున్నాయి. దీంతో వేసిన పంటలు చేతికందడం గగనంగానే మారింది.
వేసిన పంటల్లో ఇప్పటికే సగం వదిలిపెట్టుకోగా, మిగతా సగం పంటలనైనా కాపాడుకునేందుకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ పరిధిలో వరి పంట ఎండిపోతున్నది. చివరి తడుల కన్నా ముందుగానే కొద్దిమేర ఎండిపోగా ప్రస్తుతం చివరి తడులకు వచ్చే వరకు అంతకంతకూ ఎండిపోతున్నాయి. దీం తో కొందరు రైతులు ఎండుతున్న పంటలను పశువులు, గొర్రెలు, మేకలకు మేతగా వదిలేస్తున్నారు. దుబ్బాక గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎండిన వరి పంటలో గొర్రెలను మేపుతున్నారు.
కొంతమంది రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. ట్యాంకర్లను రోజువారీగా అద్దెకు తీసుకొని పంటలకు నీటి సరఫరా చేయాలంటే ఖర్చు తడిసిమోపెడవుతున్నది. సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు గ్రామాల్లో పర్యటించి ఎండిపోయిన పంట నివేదికను రూపొందించి; ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇందల్వాయి మండలంలో 245 ఎకరాలు పూర్తిగా ఎండిపోయినట్లు మండల వ్యవసాయాధికారి శ్రీకాంత్ తెలిపారు.
యాసంగిలో ఎప్పుడు వేసినట్లే నాకున్న మూడెకరాల్లో వరి పంట వేసిన. సాగునీరందక మొత్తం ఎండిపోయింది. బోర్లలో నీళ్లు అంతంత మాత్రంగానే వస్తుండడంతో పంటకు పూర్తిస్థాయిలో నీరందడంలేదు. దీంతో పంట ఎండిపోతుండడంతో చేసేదేమీ లేక వదిలేసిన పంటలో గొర్లను మేపుకొంటున్న. పొలం కోసం చేసిన ఖర్చు రూపాయి కూడా మిగుల కుండాపోయింది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు మీద పడ్డాయి. ఏం చేయాలో అర్థమైతలేదు. ప్రభు త్వం ఆదుకోవాలి.
-నాగుల నర్సయ్య, రైతు, దుబ్బాక, ధర్పల్లి మండలం
నేను పండించిన వరి పంట చేతికచ్చే దశలో ఎండిపోయింది. నాలుగెకరాల్లో వరి వేసిన. అందులోని ఒకటిన్నర ఎకరం ఎండిపోయిందని మూడు బోర్లు వేయించిన. చుక్కానీరు రాలేదు. 600 ఫీట్ల వరకు బోర్లు వేసినా ఫలితం లేదు. ఉన్న పొలమైనా చేతికి వస్తుందన్న ఆశ లేకుండా పోయింది.
-అమీర్నాయక్, మెగ్యానాయక్ తండా
నేను రెండున్నర ఎకరాల్లో వరి పంట వేసిన.సాగునీరందకపోవడంతో రెండున్నర ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. బోరు వేసినా చుక్కనీరు రాని పరిస్థితి. చేసేదేమీలేక వదిలేసిన. గ్రామంలోని పశువులకు దాణాగా మారింది. ప్రభు త్వం నష్టపరిహారాన్ని లెక్కించి ఆర్థికంగా ఆదుకోవాలి.
-బాదావత్ రాములు, కేకే తండా