రామారెడ్డి/భిక్కనూరు/రాజంపేట, మార్చి 22: అకాల వర్షాలతో కామారెడ్డి జిల్లాలోనూ పంట నష్టం వాటిల్లింది. రాజంపేట్, భిక్కనూరు, సదాశివనగర్ తదితర మండలాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రాజంపేట మండలంలో మక్కజొన్న పంట నేలవాలింది. తలమడ్ల, ఆరెపల్లి, ఆర్గొండ, బస్వన్నపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు శనివారం పరిశీలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 26 ఎకరాల్లో నష్టం జరిగిందని ఏవో శ్రుతి తెలిపారు.
కోసి ఆరబెట్టిన కంకులు తడిసిపోయాయని, మొలకలు వచ్చే అవకాశముందని రైతులు వాపోయారు. మరోవైపు, ఇంకా వర్షా లు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ ప్రకటనలతో భయాందోళనకు గురవుతున్నారు. భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లిలో సుభాన్రెడ్డి మూడెకరాల్లో సాగుచేస్తున్న బొప్పాయి తోటకి నష్టం వాటిల్లింది. 100కు పైగా బొప్పాయి చెట్లు నేలకొరిగాయని, రూ.లక్ష దాకా నష్టపోయాయని రైతు వాపోయాడు.
అంతపల్లిలో దెబ్బతిన్న మక్కజొన్న పంటలను డీఏవో తిరుమల ప్రసాద్ పరిశీలించారు. పంట నష్టం వివరాలు సేకరించి నివేదించాలని అధికారులను ఆదేశించారు. సదాశివనగర్ మండలంలో భారీ వర్షం కురియడంతో మక్కజొన్న నేలకొరిగింది. సదాశినగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, మర్కల్, ధర్మరావుపేట్, కుప్రియాల్ తదితర గ్రామాల్లో 42 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఏవో ప్రజాప్రతి తెలిపారు. అయితే, క్షేత్ర స్థాయిలో అంతకు రెట్టింపు స్థాయిలో నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు.