నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వానలతో రైతాంగం కుదేలైంది. కొద్ది రోజుల్లో పంట చేతికి రానున్న తరుణంలో దంచికొట్టిన వర్షాలు రైతులకు శాపంగా మారాయి. వరద
పోటెత్తడంతో వేలాది ఎకరాలు నీట మునిగాయి.
పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, మక్కజొన్న, పత్తి, సోయా తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నాలుగైదు రోజుల నుంచి కురిసిన వర్షాలు గురువారం కాస్త తెరిపినిచ్చాయి. అయితే, వానలు, వరదలతో ఎంత నష్టం జరిగిందనే లెక్క తేల్చడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించినట్లు కనిపిస్తున్నది. క్షేత్ర స్థాయిలో జరిగిన వాస్తవ నష్టం లెక్క తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ భారీగా పంట పొలాలు దెబ్బితిన్న తరుణంలో.. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ, వ్యవసాయ అధికారులు ఇంకా క్షేత్ర స్థాయి పర్యటనకు రాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
రైతులు కుదేలైన దుస్థితి కళ్ల ముందే కనిపిస్తుండగా అంచనాలు రూపొందించడంలో వ్యవసాయ శాఖ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది. గతంలో మాదిరి కాకుండా ఆలస్యం చేస్తుండడంతో ఓ వైపు కర్షకులకు, మరోవైపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నష్టపోయిన రైతుల వివరాలను క్లస్టర్ల వారీగా ఏఈవోలు సేకరించాల్సి ఉండగా, వారు అసలు ముఖమే చూడడం లేదని రైతులు వాపోతున్నారు. పంట రుణమాఫీ విషయంలో దరఖాస్తుల స్వీకరణ, అనుమానాల నివృత్తిలో బిజీగా ఉండటం వల్ల పని ఒత్తిడితో ఇబ్బందికి గురవుతున్నామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉన్నతాధికారులకు ఏఈవోలు రిపోర్టు చేసినట్లు తెలిసింది. పంట నష్ట వివరాల సేకరణ ఆలస్యం చేస్తే వచ్చే పరిహారం రాకుండా పోతుందేమోనన్న భయం రైతుల్లో నెలకొంది. వానలు తెరిపినిచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని అన్నదాతలు కోరుతున్నారు. వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తూ తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలంటూ బోధన్ డివిజన్ పరిధిలోని రైతన్నలంతా వేడుకుంటున్నారు.
పట్టాదారు పాస్బుక్కులతో రైతువేదికల వద్దకు తరలి వెళ్తుండగా పొలాల వద్దకే వచ్చి నష్టపోయిన పంట వివరాలు తీసుకుంటామంటూ ఏఈవోలు వారికి బదులిస్తున్నారు. నవీపేట మండలంలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌తో వందలాది ఎకరాల్లో వరి పంట మునకేసింది. దీంతో రైతుల పరిస్థితి గందరగోళంలో పడింది. పొలాల్లో అడుగు పెట్టే అవకాశమే లేకపోవడంతో నష్ట పరిహారం అందుతుందా.. లేదా? అన్నది తెలియడం లేదు. ముంపు లేకుండా పరిశీలన చేస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ పరిహారం అందిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో అధికారులు చెబుతున్న ప్రకారం 2,602 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. బోధన్ మండలంలో వెయ్యి ఎకరాలు, రెంజల్ మండలంలో 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. మిగిలిన మండలాల్లో నీట మునిగిన చోట పంట నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. వరద నీరు పొలాల నుంచి బయటికి వెళ్లి పోవడంతో నష్టం అంచనాల్లో వాటిని చేర్చలేదు. పైరు దెబ్బ తిన్నదని రైతులు ఎంతసేపు విన్నవించినా వారి వివరాలను నమోదు చేసేందుకు అధికారులు నిరాకరించినట్లు తెలిసింది.
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి రెండు రోజులుగా తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను వెంటేసుకుని పంట నష్టం వివరాల సేకరణపై ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రాంతాల్లో హుటాహుటిన నష్ట వివరాల జాబితాను రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా బోధన్ నియోజకవర్గంలోనే 90 శాతం నష్టాన్ని వ్యవసాయ శాఖ గుర్తించింది. మిగిలిన చోట్ల నష్టం జరగలేదని చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందునా బాధిత రైతుల సంఖ్య మరింత పెరిగే వీలు ఉంటుందంటున్నారు. అర్హులైన వారందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వ పెద్దలు కృషి చేయాలని రైతులు వేడుకుంటున్నారు.