ఖలీల్‌వాడి/ బోధన్/ ధర్పల్లి(సిరికొండ)/ ఆర్మూర్ టౌన్/ కంఠేశ్వర్, ఏప్రిల్ 9: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మెడీ అధికారం చేపట్టిన మొదట్లో రూ.నాలుగు వందలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు వెయ్యి రూపాయలు దాటిందని ఆవేదన వ్యక్తంచేశారు. పెంచిన ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్‌లోని ధర్నా చౌక్‌లో సీపీఐ నాయకులు గ్యాస్ బండను మోస్తూ నిరసన వ్యక్తంచేశారు. పార్టీ నాయకులు మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కేవలం రూ.45 మాత్రమే ఇస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిలిండర్ ధర పెంచడంతో పేదలకు భారంగా మారిందన్నారు. బోధన్‌లో ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
అంతకు ముందు ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. సిరికొండలో పీవోడబ్లూ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేశ్ మాట్లాడుతూ.. బీజేపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ఆర్మూర్‌లో సీపీఎం నాయకులు గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలిపారు. ఐద్వా ఆధ్వర్యంలో నాగారంలోని గోశాల వద్ద రోడ్డులో కట్టెల పొయ్యిపై వంట వండుతూ నిరసన తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రోజురోజుకూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.