ఖలీల్వాడీ, అక్టోబర్ 10: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీ కాలయాపన చేస్తున్నదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ కట్టుబడి ఉన్నదని ఒకవైపు మాట్లాడుతూనే.. మరో వైపు కేసులు వేస్తూ కేంద్రంలో రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటూ డ్రామాలాడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీకి బీసీలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 42శాతం రిజర్వేషన్ల బిల్లుకు తక్షణం ఆమోదం తెలుపాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఇప్పటికే గ్రామాల్లో పాలన కుంటుపడిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బీసీ బిల్లును అడ్డుకుంటున్న బీజేపీకి వ్యతిరేకంగా బీసీలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఓమయ్య, నాయకులు హన్మాండ్లు, రఘురాం, అంజలి, రాధా కుమార్, ప్రసాద్, గోవర్ధన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.