తమ చావుకు ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్
అన్యోన్య దాంపత్యం.. ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం
బలవన్మరణానికి తెలియరాని కారణాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి రూరల్ , మే 24 : ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. ఇద్దరు అమ్మాయిలే కావడంతో పది సంవత్సరాల క్రితమే వారి వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు అయితే ఒక్కసారిగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి బంధువులు, కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి పట్టణంలోని మాయాబజార్లో నివాసం ఉండే కుబేరం (60), లక్ష్మి (55)లు ఇంట్లోని మొదటి అంతస్తులో ఉంటున్నారు. కుబేరం తల్లిదండ్రులు కింద పోర్షన్లో ఉంటున్నారు. అయితే మంగళవారం ఇంట్లో నుంచి ఎలాంటి చప్పుడు లేదని కింద ఉండే కుబేరం తల్లి కొడుకు, కోడలిని పలుకరించేందుకు వెళ్లింది. ఇద్దరు ఉరేసుకుని ఉండడంతో ఒక్క సారిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ చావుకు ఎవరితో సంబంధం లేదని తాము ఇష్టపూర్వంగానే చనిపోతున్నామని పోస్టుమార్టం నిర్వహించవద్దని, మా ఇద్దరిని దూరం చేయకండి అంటూ సూసైడ్ నోట్ దొరికినట్లు సీఐ పేర్కొన్నారు.
అన్యోన్యంగా ఉండే దంపతులు
కొన్నేండ్లుగా వ్యాపారం చేసుకుంటున్న కుబేరం దంపతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమిటని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లు ఉండగా వారి ఇద్దరికి వివాహం జరిపించారు. ఆర్థికంగా బాగానే ఉన్నారు. పైగా వీరు అన్యోన్యంగా ఉండేవారు. ఆత్మహత్య చేసుకోవడంతో నమ్మలేకపోతున్నామంటూ కుబేరం తల్లి పేర్కొన్నది. తాము మరణించిన తరువాత మా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించ వద్దని వారి వద్ద లభించిన సూసైడ్ నోట్లో రాసి ఉంది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించినట్లు పట్టణ సీఐ నరేశ్ పేర్కొన్నారు.