కామారెడ్డి, ఆగష్టు 19 : లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 10న రాజంపేట మండలం బస్వన్నపల్లికి చెందిన పెద్దల రాజు కామారెడ్డి పట్టణంలోని ఓ హోటల్లో డ్యూటీ పూర్తి చేసుకొని తన మోటార్ సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు.
సీఎస్ఐ చర్చి మైదానం సమీపంలో గుర్తు తెలియని ఓ మహిళ పెద్దల రాజును ఆపింది. తన గ్రామం సరంపల్లి అని, అక్కడ దింపివేయాలని లిఫ్ట్ అడుగగా రాజు ఆమెను బైక్‌పై ఎక్కించుకొని సరంపల్లి వైపు బయల్దేరాడు. ఇంతలోనే సదరు మహిళ ఎవరికో ఫోన్ చేసింది. రాజు, సదరు మహిళ ఈఎస్ఆర్ గార్డెన్ సమీపంలోకి చేరుకోగానే ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి మోటర్ సైకిల్‌ను అడ్డుకున్నాడు.
సదరు మహిళతోపాటు బైక్‌పై వచ్చిన వ్యక్తి ఇద్దరు కలిసి రాజు చెంపపై కొట్టి అతడి వద్ద ఉన్న రూ.2 వేలు, మొబైల్ ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. రాజు ఈ నెల 17న కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. కామారెడ్డికి చెందిన బైండ్ల భాగ్య, తన రెండో భర్త లింగంపేటకు చెందిన రాయసాని రవికుమార్‌ను నిందితులుగా గుర్తించారు. వీరిని మంగళవారం అరెస్టు చేసి, వారి నుంచి రూ.600, మోటర్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, పట్టణ సీఐ నరహరి, ఎస్సై నరేశ్, ఏఎస్సై రంగారావు, సిబ్బంది కమలాకర్, రాజు, భాస్కర్, రవి, నరేశ్ పాల్గొన్నారు.