టీఆర్ఎస్, గులాబీ నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే భరతం పట్టేందుకు జీవన్ రెడ్డి కంకణబద్ధులై ఉంటారనే విశ్వాసం ఉందని రాష్ట్ర మంత్రి వేముల ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగినట్లు బహుశా దేశంలో ఏ నాయకుడికి ఇంత గొప్పగా జరగవన్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ వేడుకలు జరుగుతుండడం సంతోషకరమన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రజల ప్రేమ, విశ్వాసం లభించదన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో పోచంపాడ్‌కు గోదావరి నీళ్లు ఎదురెక్కించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన వ్యక్తి కేసీఆర్… అనుకున్న లక్ష్యాన్ని సాధించారన్నారు. ఒక్కడై కదిలి గులాబీ కండువాను తలపై పెట్టుకొని ఉద్యమం చేశారని చెప్పారు. కేసీఆర్ కారణజన్ముడని అభివర్ణించారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతుండడంతో మహారాష్ట్ర నుంచి ప్రజలు వచ్చి తెలంగాణలో కలుస్తామంటున్నారని తెలిపారు. కర్ణాటకలోనూ బీజేపీ ఎమ్మెల్యేనే స్వయంగా తెలంగాణలో కలుస్తామంటుంటే ఇక్కడి బీజేపీ నాయకులకు సోయి లేదా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులంతా బండ గట్టుకొని బాయిలో దూకాలన్నారు.
తెలంగాణపై మాటిమాటికి విషం చిమ్ముతున్న ప్రధాని మోదీకి ఎందుకింత వివక్ష, కక్ష పూరిత ధోరణి అంటూ మంత్రి వేముల అన్నారు. తెలంగాణను ఏపీలో కలిపే కుట్ర ఏమైనా మోదీకి ఉందా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా మోదీ పరిపాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు దేశానికి కేసీఆర్ నాయకత్వం కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అందుతున్న ప్రయోజనాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. ఇప్పుడున్న నాయకత్వంతో దేశ పరువు మసకబారుతుందని చెప్పారు. దేశంలో ఆదర్శవంతమైన పరిపాలనతో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కడుపులో విషం పెట్టుకొని కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ఆరోపించారు. ఈ ప్రాంత బీజేపీ ఎంపీలు సిగ్గుంటే ప్రధానిని నిలదీయాలన్నారు.