నిజామాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి పర్వానికి అడ్డే లేకుండా పోయింది. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే. చివరకు సెలవులైనా, హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లులైనా అడిగినంతా ఇవ్వాల్సిందే. లేకపోతే ఫైలు ముందుకు కదలదు. డీపీవోలో ఏళ్లుగా పాతుకుపోయిన ఆ నలుగురు రాజ్యమేలుతున్నారు. సొంత ఉద్యోగులపైనే వేధింపులకు పాల్పడుతూ దండుకుంటున్నారని పంచాయతీరాజ్ శాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు చాంబర్‌కు కూతవేటు దూరంలో ఉండే డీపీవోలో బరితెగిస్తున్న ఆ అక్రమార్కుల వ్యవహారం చర్చనీయాంశమైంది. నిత్యం జిల్లా స్థాయి అధికారుల రాకపోకలు కొనసాగించే గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్న డీపీవోలో గుట్టుగా వసూళ్ల పర్వం నడుస్తున్నది. కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులకు తెలుస్తే ప్రమాదమన్న భయం కూడా లేకుండా విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాకు సుదీర్ఘ కాలం తర్వాత ఇన్చార్జి డీపీవో కొనసాగుతున్నారు. ప్రస్తుతం శాశ్వత అధికారి లేకపోవడంతో అక్రమార్కులకు ఆడిందే ఆట అన్నట్లుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు.
-నిజామాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పంచాయతీ సెక్రెటరీలపై ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి ఉంది. పదుల సంఖ్యలో ఉండే విధుల్లో తలామునకలయ్యే వారికి సొంత శాఖ ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు. డీపీవోలో పని చేసే ఆ నలుగురి వేధింపులను భరించలేక పోతున్నారు. మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఆ నలుగురి కారణంగా నలిగి పోతున్నారు. సెలవు పెట్టినా, జబ్బు వచ్చి విశ్రాంతి తీసుకున్నా డబ్బులు అప్పగించనిదే బిల్లులు మంజూరు చేయరు. పైసా ఇవ్వనిదే సెలవులకు ఓకే అనరు. అడిగినంత ఇస్తేనే సరి. లేకుంటే ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు.
అకస్మాత్తుగా జిల్లా కేంద్రానికి పిలిపిస్తారు. భయపెడతారు. డబ్బులిచ్చి వెళ్లాలని ఆదేశిస్తారు. ఇవ్వకుంటే మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేస్తామని భయపెడతారు. వారు అడిగినంత ఇచ్చుకోలేక గతంలో ఓ మహిళా సెక్రెటరీ ఎదురు తిరిగింది. తనకు ఆరోగ్యం బాలేక సెలవులు తీసుకుంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని సెలవులు మంజూరు చేయలేదు. అంతే ఏదో వంకతో తనిఖీలకు ఉసిగొల్పి మెమోలు జారీ చేశారు. సహేతుకమైన వివరణ ఇచ్చినప్పటికీ ఒప్పుకోక వేధించారు. చేసేది లేక సదరు మహిళా ఉద్యోగి.. పరిపాలన సంబంధిత వ్యక్తికి అడిగినంత డబ్బును ‘కృష్ణా’ర్పణం చేశారు.
మొన్నీమధ్యే ఓ మహిళా ఉద్యోగి తన తల్లిదండ్రులకు సంబంధించిన మెడికల్ బిల్లులను డీపీవోలో సబ్మిట్ చేసింది. కానీ డీపీవో పరిపాలనలో కీలకంగా వ్యవహరించే ఓ వ్యక్తి కొర్రీలు పెట్టారు. వైవాహిక జీవితానికి దూరంగా ఉంటున్న సదరు మహిళా ఉద్యోగికి అత్తామామలతో సంబంధం లేదు. ఫలితంగా తల్లిదండ్రులకు హెల్త్ బెనిఫిట్స్ కోసం ఐప్లె చేస్తే బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తున్నాడు. చెప్పులరిగేలా తిరుగుతున్నప్పటికీ పని చేయడం లేదు.
చేసేది లేక ఓ ప్రజాప్రతినిధికి మొర పెట్టుకోగా, సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమైంది. నాపైనే ఫిర్యాదు చేస్తావా? నీ సంగతి చూస్తానంటూ సదరు ఉద్యోగి మరింత రెచ్చిపోయి ఆమెపై ప్రతాపం చూపిస్తున్నాడు. మానవత్వం లేకుండా సొంత శాఖ ఉద్యోగినికి సంబంధించిన హెల్త్ బిల్లుల మంజూరులో జాప్యం చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్న ఈ అక్రమార్కులపై పంచాయతీరాజ్ శాఖలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వద్ద సీసీగా పని చేసిన ఓ వ్యక్తి ఈ అక్రమార్కులకు అండగా ఉండే వాడని, అదనపు కలెక్టర్‌కు తప్పుడు సమాచారమిచ్చి డీపీవోలోని ఆ నలుగురి ఆగడాలను మద్దతుగా నిలిచ్చినట్లు చర్చ జరుగుతున్నది.
సీసీ పేరు చెప్పి మరింతగా రెచ్చిపోయిన వీరంతా జూనియర్ పంచాయతీ సెక్రెటరీల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారని తెలిసింది. మొన్నటి వరకు డీపీవోగా పనిచేసిన తరుణ్ ఈ మధ్యే సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. డీపీవో బదిలీని బూచీగా చూపి చాలా మంది పంచాయతీ సెక్రెటరీలను భయపెట్టి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వసూళ్లకు పాల్పడ్డట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అక్రమార్కులకు మండల స్థాయి పంచాయతీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని తెలిసింది. తమకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో అడిగినంత ఇచ్చుకోవాలని తమను ఉసిగొల్పుతున్నారని సెక్రెటరీలు వాపోతున్నారు. డీపీవోలో రాజ్యమేలుతోన్న ఈ అక్రమార్కులపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.