ఖలీల్‌వాడి, ఏప్రిల్ 8: కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు పాతరేస్తున్నాయి. నూతన విద్యాసంవత్సరం ఆరంభానికి చాలా సమయమున్నా అడ్మిషన్ల దందాకు తెర లేపాయి. కొన్ని ప్రైవేట్ బడులైతే అసలు అనుమతి లేకుండానే ప్రవేశాలు ప్రారంభించాయి. రంగురంగుల బ్రోచర్లు, ప్రధాన కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. రకరకాల జిమ్మిక్కులు చేస్తూ బుట్టలో వేసుకునే పనిలో పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలలను అడ్డుకోవడంలో జిల్లా విద్యాశాఖ విఫలమైందన్న విమర్శలు మూటగట్టుకుంటున్నది. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడంతో పాటు అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రవేశాలు షురూ..
పిల్లలను మంచి విద్యాబుద్ధులు చెప్పించాలనుకున్న తల్లిదండ్రుల ఆలోచనను ఆసరాగా చేసుకుని కార్పొరేట్ స్కూళ్లు దోపిడీకి తెర లేపుతున్నాయి. ప్రాథమిక విద్య దశలోనే ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ క్లాసులు అంటూ ప్రచారం చేసుకుంటూ రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ల ప్రచార ఆర్భాటాన్ని నమ్మి చాలామంది తల్లిదండ్రులు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. అత్యధిక ఫీజులు తలకు మించిన భారంగా మారినా పిల్లల భవిష్యత్తు కోసం తంటాలు పడుతున్నారు. మరోవైపు, వసంత పంచమి రోజు నుంచే నూతన విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభించాయి. ఈ మేరకు చాలా చోట్ల పెద్దపెద్ద ఫ్లెక్సీలు పెట్టినా, ప్రవేశాలు చేపట్టినా విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించలేదు.
విచ్చలవిడి దోపిడీ
జిల్లాలోని చాలా ప్రైవేట్ స్కూళ్లలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటేటా విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా స్పందించిన దాఖాలాల్లేవు. తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ వంటివి ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేయడం లేదు. మరోవైపు, ప్రైవేట్ బడుల్లో బుక్స్, యూనిఫామ్స్, టై, బెల్టు, షూస్ తదితర సామగ్రి విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదు. పాఠశాలలనే వ్యాపార సంస్థలుగా మార్చి విక్రయాలు చేపడుతున్నా కన్నెత్తి చూడడం లేదు. టెక్నో, గ్లోబల్, ఇంటర్నేషనల్, డీజీ, సీబీఎస్ఈ పేరిట స్కూళ్లు నడుపుతున్నా చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి.
కమీషన్లు ఇస్తూ..
విద్యా సంవత్సరం ముగియక ముందే కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. ఇందుకోసం పీఆర్వోలు, టీచర్లను రంగంలోకి దింపాయి. వారు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ఇండ్లకు వెళ్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ డిస్కౌంట్ల పేరిట అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక విద్యార్థిని స్కూల్లో చేర్పిస్తే పీఆర్వోకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు యాజమాన్యాలు కమీషన్‌గా ముట్టజెబుతున్నాయి. మరోవైపు సంబంధిత స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బంది కూడా కనీసం 20 వరకు అడ్మిషన్లు తీసుకురావాలని యాజమాన్యాలు టార్గెట్ విధించినట్లు సమాచారం.
కలెక్టర్ కొరడా ఝళిపిస్తేనే..
నగరంతో పాటు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలో ఐదు స్కూళ్లకే సీబీఎస్ఈ అనుమతులున్నాయి. నిబంధనల ప్రకారం స్కూళ్ల అనుమతులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డీఈవో నుంచి అనుమతి పొందిన తర్వాత సీబీఎస్ఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమి పట్టించుకోకుండా నేరుగా సీబీఎస్ఈ, డీజీ, ఇంటర్నేషనల్ పేరిట స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో అనుమతులు లేని పాఠశాలల వద్ద అధికారులు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోకుండా ఉంటారు. కానీ అలా చేయడం లేదు. మరోవైపు, అనుమతులు లేకుండా ప్రచారం చేస్తున్న కార్పొరేట్ స్కూళ్ల బోర్డులను తొలగించేలా చర్యలు చేపట్టడం లేదు. ఇలాంటి తరుణంలో కలెక్టర్ దృష్టి సారిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది. అనుమతి లేని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు, అక్రమ ప్రవేశాలు, అధిక ఫీజు వసూలు, అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ కొరఢా ఝళిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ రూరల్‌లోని ఓ స్కూల్‌కు ప్రభుత్వ అనుమతి లేదు. మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల విషయంలో విద్యాశాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ రాజశేఖర్, ఏఐఎఫ్డీఎఫ్ జాతీయ కన్వీనర్
అధికారుల నిర్లక్ష్యమే..
అనుమతి లేని కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నా యి. సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట తల్లిదండ్రులను మోసం చేసి అధిక ఫీజులు గుంజుతున్నాయి. విద్యాశాఖాధికారులు వాటిని అదుపు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
– అభిలాష్‌రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు
నోటీసులిస్తాం
నగరంతో పాటు జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ఎంఈవోల ద్వారా నోటీసులు ఇస్తున్నాం. అన్ని అనుమతులు తీసుకున్నాకే, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
– అశోక్, నిజామాబాద్ డీఈవో