బోధన్, ఫిబ్రవరి 14: బోధన్ పట్టణంలో హరిజన సుధార్ సమితి మాల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి మాట్లాడుతూ.. నమ్ముకున్న మాలలను కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచిందని మండిపడ్డారు.
ఆ పార్టీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టడం ఖాయమన్నారు. 2011 జనాభా లెక్కల్లో ఉపకులాల గణన జరగలేదని, తప్పుడు జనాభా లెక్కలతో వర్గీకరణ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏండ్లు గడిచిన తర్వాత కూడా పాత జనాభా లెక్కలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మాలలకు అన్యాయంచేశారని, ఇకనైనా మాలలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలని పిలుపు ఇచ్చారు.
కార్యక్రమంలో మాల మహానాడు బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు కారం స్వామి, హరిజన సుధార్ సమితి మాల సంఘం అధ్యక్షుడు పెరక స్వామి, మాల నాయకులు పల్లాటి యాదగిరి, నీరడి అశోక్, బాలకృష్ణ, మల్లేశం, కాపర్ల స్వామి, శ్రీనివాస్, పల్లాటి లక్ష్మణ్, కేశవ్, లింగాలరాజు తదితరులు పాల్గొన్నారు.