కామారెడ్డి, డిసెంబర్ 6: సదాశివనగర్ మండలం జనగామ, లింగంపల్లి గ్రామాల వద్ద ఫుడ్ ప్రాసెసింగ్, జనపనార పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశపు హాలు లో ఎమ్మెల్యే సురేందర్ ఆధ్వర్యంలో జనగామ, లింగంపల్లి గ్రామాలకు చెందిన 70 మంది రైతులు కలెక్టర్ జితేశ్ పాటిల్‌ను సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులకు మరోచోట భూములను కేటాయిస్తామన్నారు. భూమి వద్దనుకునే రైతులకు నష్టపరిహారం అందజేస్తామ ని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు.అభివృద్ధికి సహకరించి, పరిశ్రమల వద్ద ఆందోళన చేయవద్దని కోరారు. నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు.
రైతులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే సురేందర్
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రైతులకు నష్టపరిహారం అందించడంలో తాను వెన్నంటి ఉంటానని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, జనపనార పరిశ్రమల ఏర్పాటుతో ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి అపోహలకు గురికావద్దన్నారు. జ్యూట్ పరిశ్రమ ఏర్పాటుతో జనపనార సాగు ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి ఆందోళనలు చేయవద్దని, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు బొలిపల్లి మహేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ గడీల భాస్కర్, మండల కన్వీనర్ ఏలేటి భూమారెడ్డి, లింగంపల్లి, జనగామ సర్పంచులు సాయిలు, జనగామ, లింగంపల్లి గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు పాల్గొన్నారు.