కాంగ్రెస్ సర్కార్ పై కాంట్రాక్టర్ల తిరుగుబాటు!
కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. రూ.వేలాది కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుకై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పైసా బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- నిజామాబాద్ జిల్లాలో రూ.250 కోట్ల మేర బకాయిలు..
- రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చిన కాంట్రాక్టర్లు…
- ప్రజాపాలనలో ఆత్మహత్యలే శరణ్యమైందని పలువురి ఆవేదన..
- పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 18న ఛలో హైదరాబాద్
నిజామాబాద్, జూన్ 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంట్రాక్టర్లు రోడ్డు ఎక్కారు. రూ.వేలాది కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుకై ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. రెండున్నరేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క పైసా బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రాజకీయాలకు అతీతంగా కాంట్రాక్టర్లు అంతా కలిసి ఒక్కటయ్యారు. ఒక వేదికపై వచ్చి నిరసన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. క్లాస్ 1 కాంట్రాక్టర్ల నుంచి మొదలు పెడితే చిన్నా చితక కాంట్రక్టర్లు అంతా కలిసి జూన్ 18న ఛలో హైదరాబాద్‌కు సిద్ధం అవుతున్నారు.
ప్రభుత్వానికి తమ ఆవేదన తెలిసే విధంగా కాంట్రాక్టర్లు భారీ కార్యాచరణతో ముందుకు కదులుతున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నేతృత్వంలో తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఇతర ప్రతినిధులంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక అంశాలను కాంట్రాక్టర్లు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాలో నేటి వరకు సుమారుగా రూ.250 కోట్లు బకాయిలు పేరుకు పోయాయని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తం బకాయి రూ.25వేలు కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి తమ ఆవేదన తెలిపేందుకే ఛలో హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టామని వారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లులు రాకపోవడంతో అప్పులు బాధ, ఆర్థిక సమస్యలతో 10 మంది కాంట్రాక్టర్లు చనిపోయారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు..
ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్లు చనిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కాంట్రాక్టర్లు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బిల్లులు చెల్లింపుల్లో కాలాయాపనతో రుణాల ఊబిలో కూరుకు పోతున్నాం. మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మమ్మల్ని ఆదుకునేదెవరు అని ఆలోచించే ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చాం. మున్సిపల్ శాఖలో ఎన్నో గ్రాంట్లు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర నిధులు ఎటు పోతున్నాయో ఎవరికీ తెలియడం లేదు.
ఆర్థిక సంఘం నిధుల పత్తా లేదు. సీఎం శాఖలోని అంశాలు మాట్లాడుదామంటే మాట్లాడనివ్వరు. ఆయనను కలిసేందుకు లోపలికి మమ్మల్ని రానివ్వరు. కాంట్రాక్టర్లు రోడ్డున పడి విలవిల్లాడుతున్నారు. పేమెంట్ సమస్య జఠిలంగా మారింది. చేసిన పనులకు చెల్లింపులు చేయకపోతే బతికేది ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.25వేల కోట్లు పెండింగ్‌లో ఉండి పోయాయి. కనీసం దశల వారీగా చెల్లింపులు జరిపినా ఈ పరిస్థితి వచ్చేది కాదు. నో పేమెంట్… నో వర్క్… స్లోగన్‌తో ఇప్పుడు ముందుకు కదులుతున్నాం. కొంత మంది పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అప్పుల్లో కూరుకు పోయారు.
-రవీందర్ రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వంతోనే వర్క్ అగ్రిమెంట్స్.. పార్టీలతో కాదు..
కాంట్రాక్టర్లు చేసే పనుల ఒప్పందా లు ప్రభుత్వాలతో జరుగుతాయి. గవర్నర్ పేరు మీద సంబంధిత శాఖ ఎస్ఈ సమక్షంలో ఒప్పందాలు చేసుకుంటాము. రాజకీయ పార్టీలతో అగ్రిమెంట్స్ జరుగవు. ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తదుపరి బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. గత అక్టోబర్‌లో కొంత మంది మంత్రులను కలిస్తే గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మమ్మల్ని అడుగొద్దు అంటూ దబాయించారు.
మా ప్రభుత్వం మొన్ననే వచ్చిందంటూ దాట వేస్తున్నారు. ఈ విధంగా మాట్లొడద్దని మంత్రులకు మేమంతా చెప్పాము. అయినప్పటికీ స్పందన లేదు. గవర్నర్ ద్వారా అగ్రిమెంట్ చేసుకున్న పనులకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని చెప్పడం సరి కాదు. పుండు మీద కారం చల్లినట్లుగా మంత్రులు మాట్లాడటంపై చాలా బాధ పడ్డాము. వారం రోజులుగా ఛలో హైదరాబాద్ కోసం ప్రతి జిల్లా తిరుగుతున్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బిల్లులు మంజూరు కావడం లేదా? అంటే అదేమి లేదు. మెఘా, నవయుగ కంపనీలకు బడా వ్యాపారులకు పేమెంట్స్ క్లియర్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదే పద్ధతిలో మా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
– భాస్కర్ రెడ్డి, బిల్డర్స్ అసిసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి
తక్షణం కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించాలి..
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఒక్క పైసా మంజూరు చేయడం లేదు. ఫలితంగా కాంట్రాక్టర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నాము. ప్రభుత్వంలో పెద్దలను కలిసి విన్నవిస్తున్నాము. అయినప్పటికీ స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉన్నది. మా బాధలు ప్రభుత్వమే పట్టించుకోకపోతే మేము ఎవరినీ అడగాలి? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదు. అందుకే మా బాధలను ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాము. జూన్ 18న ప్రతి కాంట్రాక్టర్ తరలి రావాలని కోరుతున్నాము.
-ప్రవీణ్ రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ పాలనలో పనులు చేస్తే పైసల్ ఇవ్వరా?
కాంట్రాక్టర్లకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రభుత్వంతో కలిసి పని చేయడమే మాకు తెలుసు. కానీ గత ప్రభుత్వంలో చేసిన పనులకు పైసల్ ఇవ్వమంటే ఎట్లా? ముఖ్యమంత్రి స్వయంగా ఇలాంటి విషయాలు మాట్లాడటం సరైంది కాదు. కాంట్రాక్టర్లు ఎవ్వరూ సొంత డబ్బులతో పనులు చేయరు. అన్ని డబ్బులు ఎవ్వరికీ ఉండవు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల్లో రుణాలు తీసుకు వచ్చి, వడ్డీలకు అప్పులు తెచ్చి పనులు చేసిన వారే ఉంటారు. ఈ ప్రభుత్వంలో కూడా పనులు అనేకం చేసినప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదు. మా కాంట్రాక్టర్ల జీవితాలు రోజురోజుకూ ఆర్థిక ఊబిలో దిగబడి పోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది.
– రాజన్న, కాంట్రాక్టర్
మాకు ఉన్న గోస ఎవ్వరికీ లేదు…
కాంట్రాక్టర్లకు ఉన్న గోస ఎవ్వరికీ లేదు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బిల్లులు వస్తలేవు. ఎన్నో బాధ లు పడి… కష్టాలు పడి పైసల్ తీసు కు వచ్చి పనులు చేస్తే బిల్లులు ఇవ్వరా? పోలీసులను తోసుకుంటూ భట్టీ విక్రమార్క దగ్గరికి పోయాము. పని కాలేదు. మహేశ్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయాము. స్పందన లేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దగ్గరికి పోయాము. ఇప్పుడు ఎక్కడివి డబ్బులు అన్నడు. ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి పనులు చేయమంటారు. పనులు చేస్తే పైసల్ ఇవ్వకపోతే ఎట్లా? వడ్డీ వ్యాపారులకు మంచిగున్నది. వడ్డీల మీద వడ్డీలు కట్టడానికి కూడా చేతుల్లో డబ్బుల్లేవు. గవర్నమెంట్ అస్సలే పట్టించుకుంటలేదు. ఈ గోస ఎప్పుడూ చూడలేదు. కాంట్రాక్టర్ల గోస మరెవ్వరికీ రాకూడదు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

