మెండోరా, ఫిబ్రవరి 21 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే రికార్డు బ్రేక్ కానున్నది. ఎస్సారెస్పీ జలవిద్యుత్ ఉత్పత్తి చరిత్రలో 1990-91 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 146.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 128.2367 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన కాకతీయ కాలువతో యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతున్నది. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం 1987లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 146.4 మిలియన్ యూ నిట్ల ఉత్పత్తి రికార్డుగా నమోదైంది. కానీ ఆ సమయంలో జిల్లా కేంద్రంలో 3 టర్బాయిన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. 2010 నుంచి 4వ టర్బాయిన్ అందుబాటులోకి వచ్చింది. ఒక్కో టర్బాయిన్ నుంచి 9 మెగావాట్ల చొప్పున నాలుగు టర్బాయిన్లతో 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో 30 రోజులు గడువు ఉంది. రికార్డు బ్రేక్ కావడానికి మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. ప్రస్తుతం 130 మిలియన్ యూనిట్లకు చేరుతుండడంతో ఎస్సారెస్పీ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా యాసంగి సీజన్‌కు నీటి విడుదల కొనసాగుతుండడంతో ్త నిరంతరంగా విద్యుత్ ఉత్పతి అవుతున్నది. మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే రికార్డు బ్రేక్ అయినట్లేనని ఎస్సారెస్పీ అధికారులు అంటున్నారు. అదేవిధంగా 1989-90 సంవత్సరంలో 125.45 మిలియన్ యూనిట్లు, 1988-89లో 137 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.
రికార్డు బ్రేక్ చేస్తాం
కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో జెన్కోలో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో 128 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశాం. మరో 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించి రికార్డు బ్రేక్ చేస్తామనే నమ్మకం ఉన్నది.
-రమేశ్‌బాబు, జెన్కో ఇంజినీర్