Nizamabad | కంటేశ్వర్, డిసెంబర్ 31 : వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ అన్నారు. కంన్సూమర్స్ డే సందర్భంగా డిసెంబర్ 24న న్యూఢిల్లీ నుండి ప్రారంభమైన వినియోగదారుల చైతన్య భారత యాత్ర సందర్భంగా జనవరి9న దక్షిణాది రాష్ర్టాలలో ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణితో కలిసి అవగాహన కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
ఇందూర్ వినియోగదారుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ హక్కుల పట్ల అవగాహన ఉన్నట్లయితే ఎటువంటి ఆర్థిక మోసాలకు గురికారని సూచించారు. ఆన్ లైన్ మోసాలు, రుణ యాప్ లు, రియల్ ఎస్టేట్ మోసాలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి వాటిని వినియోగదారుల రక్షణ చట్టం 2019 ద్వారా ఏర్పడిన కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో భారత చైతన్య యాత్రలో ఆయా ప్రాంతాల వినియోగదారుల సంఘాలు, సంబంధిత ప్రభుత్వ సంస్థలు పాల్గొని వినియోగదారులకు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్ష, కార్యదర్శులు పెందోట అనిల్ కుమార్, సందు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శి మహాదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.