నిజాంసాగర్/నవీపేట, మార్చి 20: వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీల ముందర చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. నిజాంసాగర్లోని గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఉదయం నుంచే వినియోగదారులు బారులు తీరారు. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా బాన్సువాడలో కార్యాలయం ఏర్పాటు చేసి, తమ కు గ్యాస్ అందకుండా చేస్తున్నారని నిరసనకు దిగారు. బాన్సువాడలో అదనంగా వసూలు చేస్తూ సిలిండర్లు అక్రమంగా విక్రయిస్తున్నారని రెవెన్యూ అధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు.
ఆర్ఐ సాయిలు, జీపీవో శేఖర్ అక్కడకు చేరుకోగా, వినియోగదారులు చుట్టుముట్టారు. తమ పేర్లపై సిలిండర్లు బుక్ చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టగా, వాస్తవాలు వెలుగు చూశాయి. బాన్సువాడలో అక్రమంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నట్లు తేలింది. స్టాక్ పరిశీలించగా, అసలు అన్లైన్లో వివరాలు నమోదు చేయకుండా, తెల్లకాగితంపై బిల్లు అందిస్తూ సిలిండర్లు అందిస్తున్నారని వెల్లడైంది. దీంతో నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఐ.. ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు.
వంట గ్యాస్ కోసం నవీపేటలోని గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు శుక్రవారం కూడా బారులు తీరారు. ఉద యం నుంచి సాయం త్రం వరకూ మండుటెండలో వరుసలో నిల్చున్నారు.