బాన్సువాడ : కేంద్రం మంజూరు చేసిన నిధులతో మెదక్, కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి పనులు (National highway ) శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.526 కోట్లతో నిర్మిస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు. మెదక్(Medak), ఎల్లారెడ్డి (Yellareddy) ,బాన్సువాడ (Banswada) మీదుగా రుద్రూర్(Rudrur) వరకు నేషనల్ హైవే 765 డీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టింది .
దీనిలో భాగంగా మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు మొదటి విడతగా 43.91 కిలోమీటర్ల మేర పనులకు ప్రభుత్వం రూ. 213 కోట్లను కేటాయించింది. రెండో విడతగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు నిర్మించేందుకు 51. 66 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులకు సుమారు రూ. 313 కోట్లను కేంద్రం(Central) మంజూరు చేసింది. మొదటి ,రెండు ప్యాకేజీ పనులు జెట్స్పీడ్లా కొనసాగుతున్నాయి.
ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా చెత్తచెదారం , చెట్లను తొలగించి రోడ్డు వెడల్పు పనులను పూర్తిచేశారు. అనంతరం కంకర వేసి గ్రామాలకు వెళ్లే సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. రెండో విడత ప్యాకేజీలో భాగంగా ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు కొనసాగే నేషనల్ హైవే రోడ్డు పనులలో ఇప్పటికే 50 శాతం మేర రోడ్డు పనులను, బ్రిడ్జిలను నిర్మించారు.
జాతీయ రహదారి నిర్మాణంతో భూముల ధరలు పెరిగాయి..
మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా రుద్రుర్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల వల్ల రోడ్డుకు ఇరువైపులా భూములున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం వల్ల ఊహించని రీతిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని , గ్రామాల గుండా వెళ్లే రహదారికి సర్వీస్ రోడ్డు నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అటవీ భూములకు అనుమతులు రాక పనుల్లో ఆటంకం
మెదక్ నుంచి ఎల్లారెడ్డి ,బాన్సువాడ మీదుగా రుద్రుర్ వరకు నిర్మించే 95 కిలోమీటర్ల మేర రోడ్డు పనులలో 18 కిలోమీటర్ల అటవీ మార్గంలో ఉంది. అయితే రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉండగా జాప్యం జరుగుతుండడంతో పనుల్లో ఆటంకం ఎదురవుతుంది. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లింపులు జరిగితే పనులు మరింత వేగవంతంగా జరిగే ఆస్కారం ఉంది.
నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాకర్లపై చర్యలు : డీఈ ప్రవీణ్ రెడ్డి
మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు నిర్మించే నేషనల్ హైవే రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని డీఈ ప్రవీణ్ రెడ్డి హెచ్చరించారు. మొదటి ప్యాకేజీ మెదక్ నుండి ఎల్లారెడ్డి వరకు ఇప్పటికే 18 కిలోమీటర్లు మేరా బీబీఎం బీటీ రోడ్డు వేసామని, రెండో ప్యాకేజీ లో కూడా ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు జరిగే పనుల్లో 14 కిలోమీటర్లు చేపట్టామని తెలిపారు. వచ్చే సంవత్సరం కల్లా పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు .