సమైక్యపాలనలో ఎల్లారెడ్డి అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉండేది. నిధుల కొరతతో వెనుకబడిన ప్రాంతంగా మాట్లాడుకునేవారు. అప్పుటి పాలకులు మేజర్ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలకు కనీస వసతులు కరువయ్యాయి. వీటిని కల్పించడంలోనూ పూర్తిగా వైఫల్యం చెందారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారింది. కేసీఆర్ ప్రభుత్వం పల్లెల నుంచి పట్టణాల వరకు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
-ఎల్లారెడ్డి, ఆగస్టు 13
ఎల్లారెడ్డి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. దీంతో కోట్ల రూపాయలు నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించడంతో ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. నాటికి…నేటికి ఉన్న తేడా ఎల్లారెడ్డిలో స్పష్టం గా కనిపిస్తున్నది. పట్ట ణ సరిహద్దు నుంచి విశాలమైన రోడ్లు, డివైడర్లపై ఏపుగా పెరిగిన హరిత హారం మొక్కలు, సెంట్రల్ లైటింగ్‌తో సుందరంగా మారింది. జాతీయ జెండా రంగుల మెరుపుల లైట్లు పట్టణ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పట్టణంలోకి మూడు వైపుల నుంచి ఉన్న దారులన్నీ అంబేద్కర్ చౌరస్తా వరకు వచ్చేందుకు స్వాగతిస్తున్నాయి. వంద అడుగుల వెడల్పుతో ఏర్పాటైన సిమెంటు రోడ్డుతో ట్రాఫిక్ ఇబ్బందులకు చరమగీతం పాడి పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. డివైడర్‌పై ఉన్న రంగు రంగుల మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దీనికితోడు పట్టణంలోని చౌరస్తాలతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు పట్టణ రూపురేఖలు మార్చేశాయి. పట్టణ నడి బొడ్డున నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, దానికి ఎదురుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్, దానికి ఆనుకొని ఏర్పాటవుతున్న వంద పడకల ప్రభుత్వ వైద్యశాల ఉండడడంతో ప్రజలకు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
ఎల్లారెడ్డి పట్టణంలో వంద పడకల వైద్యశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండడంతో నియోజక వర్గంలోని ప్రజల చెంతకే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. వైద్యశాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేయడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిధులు విడుదల చేసిన వెంటనే ఆరోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు పనులను ప్రారంభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 50 పడకల వైద్యశాల నుంచి ఒకేసారి వంద పడకల వైద్యశాలగా మారడంతో వివిధ రకాల వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికే మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉండడంతోపాటు వివిధ వి భాగాల్లో వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు.
మున్సిపాలిటీ ఏర్పాటు తరువాత పట్టణంలోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరినీ రోడ్డు డివైడర్లు ఆకట్టుకుంటున్నాయి. రూ. 3.5 కోట్లతో చేపట్టిన రోడ్డు డివైడర్ ఎల్లారెడ్డి పట్టణ ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్ట నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి గాంధీ చౌక్, గాంధీ చౌక్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు, పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు ఉన్న డివైడర్‌పై నాటిన పూల మొక్కలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో పట్టణ పచ్చదనంతో కనువిందు చేస్తున్నది. పిల్లల కోసం ప్రత్యేక పార్కు పట్టణంలోని ఉన్న ఎస్బీఐ వెనుక భాగంలోని పిల్లల పార్కును రూ.80 లక్షలతో అభివృద్ధి చేశారు. పిల్లలు ఆడుకునేందుకు వివిధ ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. మహిళలు, వృద్ధులు నడిచేందుకు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వీటికి తోడు ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ శిథిలావస్థకు చేరుకోగా.. రూ. 4.20 కోట్లతో కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రతిరోజూ పట్టణానికి వేలాది మంది రాకపోకలు సాగిస్తుండడంతో వారి కోసం రూ. 20 లక్షలతో టాయ్లెట్లు నిర్మించారు.
నియోజక వర్గ కేంద్రమైన ఎల్లారెడ్డిలో పట్టణవాసులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇందుకోసం నీటి పారుదల శాఖ స్థలాన్ని కేటాయించారు. ఎకరం విస్తీర్ణంలో కూరగాయలు, నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోకరంగా మరనున్నది. మార్కెట్ నిర్మాణం కోసం మున్సిపాలిటీ ప్రత్యేక నిధులు కేటాయించడం కారణంగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. కూరగాయలతోపాటు చికెన్, మటన్, చేపలు ఒకే దగ్గర లభించడం పట్టణ ప్రజలకు సౌకర్యంగా మారుతున్నదని అంటున్నారు.
పట్టణంలోని 12 వార్డుల్లో రూ. 10 కోట్లతో మురికి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో పట్టణ పరిధిలోనే ఈ పనులు కొనసాగుతాయని మున్సిపల్ కమిషనర్ జీవన్ తెలిపారు. మున్సిపల్‌గా రూపాంతరం చెందిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరుచేయడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే సుమారు రూ. 6 కోట్లతో సీసీ రోడ్డు పనులు పూర్తి కాగా మరో రూ. 10కోట్లతో పనులు పూర్తయితే సుందర పట్టణంగా మారనున్నది.