వినాయక్‌నగర్, మే 18: సమాజానికి, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కొంతకాలంగా అవినీతి, అక్రమాలకు పాల్పడున్నారు. కొందరు పోలీసులు వక్రమార్గంలో వెళ్తూ పోలీసుశాఖను అప్రతిష్టపాలుచేస్తున్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో అవినీతి, అక్రమాలు, సివిల్ తగాదాలు, ఇసుక అక్రమ రవాణా తదితర కేసుల్లో కొందరు పోలీసులు సస్పెన్షన్ వేటుకు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇంతజరిగినా కొందరిలో ఇంకా మార్పు రావడంలేదు. తాజాగా ఓ కానిస్టేబుల్ ఏకంగా వడ్డీ వ్యాపారిగా అవతారమెత్తి అమాయకుల బలహీనతను ఆసరాగా తీసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఎలాంటి అనుమతులూ లేకుండా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ చెల్లించని వారి ఆస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడు.
సదరు కానిస్టేబుల్ వేధింపులు తాళలేక బాధితులు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ రూరల్ ఎస్సై మమ్మద్ ఆరీఫ్తోపాటు విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలు.. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కూతురు అనారోగ్యంతో దవాఖానలో చేరింది. చికిత్స కోసం డబ్బులు అవసరం ఏర్పడింది.
ఈ విషయం ఓ వ్యక్తి ద్వారా మెండోరా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ కానిస్టేబుల్ కలివరి గంగాధర్‌కు తెలిసింది. దీంతో కానిస్టేబుల్ గంగాధర్ సదరు మహిళ వద్దకు వెళ్లి మీ వద్ద ఏదైనా ప్రాపర్టీ ఉంటే తన పేరిట సేల్ డీడ్ చేస్తే డబ్బులు ఇస్తానని నమ్మించాడు. దీనికి అంగీకరించిన మహిళ తనకు చెందిన రూ.20 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్‌ను కానిస్టేబుల్ పేరిట సేల్‌డీడీ చేసి ఇచ్చింది.
ఈ మేరకు సదరు మహిళకు కానిస్టేబుల్ రూ.8లక్షలు ఇచ్చి, 5 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కండీషన్ పెట్టాడు. సదరు మహిళ తీసుకున్న డబ్బులకు సకాలంలో వడ్డీ చెల్లించడం లేదని కానిస్టేబుల్ రికవరీ కోసం పెట్టుకున్న వ్యక్తులను ఆమె ఇంటికి పంపించి వేధించసాగాడు. వేధింపులు ఎక్కువకావడంతో సదరు మహిళ శనివారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కె.గంగాధర్ పై ఫిర్యాదు చేసింది. దీంతో గంగాధర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యండీ ఆరీఫ్ తెలిపారు. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి మరొకరిని వేధిస్తున్నట్లు తెలుసుకొని సుమోటో కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.