Kamareddy | గాంధారి, మార్చి 20 : పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల పైకి అతివేగంగా ఓ కారు దూసుకురావడంతో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రవి, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. బస్టాండ్ సమీపంలోని హనుమాన్ టిఫిన్ సెంటర్ వద్ద తమ ద్విచక్ర వాహనాన్ని ఆపుకొని అక్కడ నిలుచున్నారు.
అదే సమయంలో కామారెడ్డి వైపు నుండి వేగంగా వచ్చిన కారు వారి పైకి దూసుకొచ్చింది. అది గమనించిన వారు తేరుకునేలోపే రవి అనే కానిస్టేబుల్ను కారు ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొనడంతో కానిస్టేబుల్ రవి(38) చాలా దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ సుభాష్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రవి.. తాడ్వాయి మండలంలోని దేమే గ్రామస్తుడని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు.