వినాయక నగర్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయాన్ని (Navodaya Vidyalaya) బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి( Congress MLA Sudarsan reddy ) అడ్డుకున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Arvind ) ఆరోపించారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వల్లే నవోదయ విద్యాలయం వెనక్కి వెళ్లిందని ధ్వజమెత్తారు.
రూ. 100 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయానికి కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం ఉన్నప్పటికీ, దాన్ని కాదని వివాదాల్లో ఉన్న బోధన్ షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని నవోదయ విద్యాలయం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామ పరిధిలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం అనుకూలంగా ఉందని వెల్లడించారు. ప్రైవేటు భూములైన నిజాంషుగర్ ఫ్యాక్టరీ ( Nizam Sugars ) భూములను నవోదయ విద్యాలయానికి ఎలా ఇస్తారని ఎంపీ ప్రశ్నించారు. కాంగ్రెస్ వాదనలను పరిశీలిస్తే నిజాంషుగర్ ఫ్యాక్టరీ తెరిచే ఉద్దేశం కాంగ్రెస్ వారికి లేదా అని అనుమానం వ్యక్తం చేశారు.
మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకొండ చేసి సొంతంగా ఇథనల్ ఫ్యాక్టరీ ( Ithanal Factory) ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు అడ్డుపడుతుందని, అందుకు ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని వివరించారు. ఈ సమావేశంలో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.