నిజామాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో వింత ధోరణి కొనసాగుతున్నది. జనం ఛీత్కరించిన వారిదే హవా నడుస్తున్నది. ఎన్నిక ల్లో ప్రజలు ఓడించిన వారికే యంత్రాం గం వత్తాసు పలుకుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు నేతలు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. శాసనసభ్యుడి వలే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఘనంగా చెప్పుకుంటున్న ప్రజా పాలనలో కనిపిస్తున్న విచిత్రమిది. సాక్షాత్తు కలెక్టర్ల ఎదుటే ప్రొటోకాల్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. ఓడిపోయిన నేతలనే యంత్రాంగం అందలం ఎక్కిస్తున్న వైనం ఉమ్మడి జిల్లాలో మాత్రమే కనిపిస్తున్నది. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంత మొత్తుకుంటున్నా అటు ప్రభుత్వం, ఇటు యంత్రాంగం కిమ్మనడం లేదు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినా, బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో లేవనెత్తినా సర్కారు నుంచి కనీస స్పందన కరువైంది. శాసనసభ్యులకు కనీస గౌరవం దక్కని దుస్థితిని రూపుమాపాల్సిన ఉన్నతాధికారులే మిన్నకుండి పోతుండడంతో రోజురోజుకూ ఈ పెడ ధోరణి విస్తృతమవుతున్నది. అడిగే వారు, అడ్డు చెప్పే వారు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతున్నది.
రాష్ట్ర స్థాయి పదవిని అనుభవిస్తున్న వ్యక్తి కామారెడ్డి షాడో ఎమ్మెల్యేగా అధిరాక దర్పం ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆయనను కాదని అన్నింట్లోనూ వేలు పెడుతున్నాడు. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కాంగ్రెస్ కీలక నేత యంత్రాంగాన్ని పావుగా వాడుకుంటున్నాడు. భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్, కాచాపూర్ సొసైటీ విభజన విషయంలో కాంగ్రెస్ వృద్ధ నేత జోక్యం చేసుకుని అభాసుపాలయ్యాడు. బీఆర్ఎస్ నేతల ఆధిక్యం ఉండటంతో సొసైటీని అల్లకల్లోలం చేసి రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నానికి ఒడిగట్టాడు. కానీ బీఆర్ఎస్ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించి ధైర్యంగా కుట్రలను ఎదుర్కొన్నారు. ఈ విషయంలో కామారెడ్డి జిల్లా సహకార శాఖ అధికారి నేరుగా కాంగ్రెస్ నేతల చెప్పుచేతల్లోకి వెళ్లి, వారు చెప్పినట్లు పని చేసి పెట్టాడు. కానీ, కోర్టు ఆదేశాలతో తిరిగి నిబంధనలను అమలు చేయాల్సిన దుస్థితిని తెచ్చుకున్నాడు. ఇలా అనేక విషయాల్లోనూ కామారెడ్డి కాంగ్రెస్ నేత తీరు వివాదాస్పదంగా మారింది. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ ఎమ్మెల్యే ప్రభావం కనిపించకుండా కాంగ్రెస్ నేతలే నిత్యం హల్చల్ చేస్తున్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్‌గా బీఆర్ఎస్ నేత ఉన్నప్పటికీ, మున్సిపల్ వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట నిబంధనల మేరకు ప్రొటోకాల్ అమలవుతుండగా, అదే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యేకు పాత సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చారు. దీంతో అతడ్ని బదిలీ చేసే దాకా సదరు ఎమ్మెల్యే విడిచిపెట్టలేదు. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ నేతలు తమ తప్పులు గ్రహించి, మంచి పనులు చేస్తూ జనం మనసుల్ని గెలుచుకోవాలి. కానీ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ తామే ఎమ్మెల్యేలమని అధికార దర్పం ప్రదర్శిస్తున్న తీరు అంతటా చర్చనీయాంశమైంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే, ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలను కాదని, ఓడిన వారికే యంత్రాంగం వత్తాసు పలుకుతున్నది. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ అధికారాలను చలాయిస్తున్న కాంగ్రెస్ నేతలు చెప్పినట్లే నడవుచుకుంటున్నది. కార్యనిర్వాహక వ్యవస్థకే సిగ్గుచేటుగా కొంత మంది ఉన్నతాధికారుల తీరు ప్రజల్లోనూ ఈసడింపునకు గురి చేస్తున్నది. ఆదిలోనే అనధికార వ్యక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోగా, వారిని ప్రోత్సహిస్తుండడంపై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులకే నియోజకవర్గంలో ప్రభుత్వంతో సంబంధాలుండాలి. ప్రజలకు, ప్రభుత్వానికి ఎమ్మెల్యేనే వారధిగా ఉండాలి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత బహిరంగంగానే ప్రభుత్వ ప్రతినిధిగా తానే ఉంటానంటూ చెప్పుకోవడం విడ్డూరంగా మారింది. బాల్కొండలోనూ ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సహజ వనరులను కొల్లగొడుతుండడం విమర్శలకు తావిస్తున్నది. ఇసుక, మొరం, కంకర వంటి దందాల్లో రూ.లక్షల్లో దండుకుంటున్నా అధికారులు కిమ్మనడం లేదు. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకులపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. భీమ్‌గల్‌లో అయితే ఇసుక వ్యాపారులు ఏకంగా దాడులకు తెగబడి బీఆర్ఎస్ నేతలను రక్తమొచ్చేలా కొట్టారు.
ఆర్మూర్, బాల్కొండలో నిబంధనల ఉల్లంఘనలపర్వం తారాస్థాయికి చేరింది. జీపీ సెక్రటరీ నుంచి ఆర్డీవో దాకా అందరూ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జీలకే సలాం కొడుతున్నారు. వికారాబాద్ కలెక్టర్‌పై గిరిజన రైతుల దాడి సమయంలో ఉద్యోగ సంఘాల నేతలంతా ఊకదంపుడు ఉపన్యాసాలు, నీతి వ్యాఖ్యలు ప్రబోధించారు. అవే సంఘాలు ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో జరుగుతున్న ఉల్లంఘనలపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇదేం నీతి, ఇదేం పద్ధతి అంటూ ప్రజలు ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నిస్తున్నారు.